ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీలో సాంకేతిక సేవలు మరింత పారదర్శకంగా అమలు : ఈవో శ్యామలరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 06:59 AM

తిరుమల తిరుపతి దేవస్థానం  సేవలను మరింత పారదర్శకంగా, భక్తులకు సులభతరంగా అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించనున్నామని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శనివారం జరిగిన "డయల్ యువర్ ఈవో" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో నేరుగా మాట్లాడి, వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనంతరం టీటీడీ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను ఆయన వివరించారు.భక్తులకు సత్వర సేవలందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎఫ్‌ఎంఎస్ మానిటరింగ్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేయనున్నట్లు ఈవో తెలిపారు. గూగుల్‌తో ఒప్పందం, ఆధార్ ఆధారిత నమోదు ప్రక్రియ, కియోస్క్ సేవల ద్వారా భక్తులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి తేనున్నామన్నారు. అంతేకాకుండా, భక్తుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సేవలను మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీలో సమగ్ర ప్రక్షాళన చేపడుతున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం వంటి కీలకమైన అంశాల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు వివరించారు. శ్రీవారి సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రవాస భారతీయులు  శ్రీవారి సేవలో పాలుపంచుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే గోమాతలకు సేవ చేసేందుకు ‘గోసేవ’ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవలో గ్రూప్‌ లీడర్ల వ్యవస్థ‌ను ప్ర‌వేశ‌పెట్టి, వారికి ద‌శ‌ల‌వారీగా శిక్ష‌ణ ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నామన్నారు.వేసవి తీవ్రత దృష్ట్యా తిరుమలతో పాటు టీటీడీ స్థానికాలయాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, కూల్ పెయింట్ వేయించడంతో పాటు, నిరంతరాయంగా నీటిని పిచికారీ చేస్తున్నామన్నారు. రద్దీ ప్రాంతాలు, క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగ విరివిగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో దర్శన టోకెన్ల కోసం వేచి ఉండే భక్తులకు కూడా ఈ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీలో ప్రత్యేకంగా పట్టణ ప్రణాళిక శాఖను ఏర్పాటు చేశామని, ఇందుకు అవసరమైన పోస్టుల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని ఈవో అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీల సహకారంతో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం, కపిలతీర్థం, నాగాలాపురం, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం తీర్థాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నామన్నారు.తిరుమలలోని 45 విశ్రాంతి భవనాల పేర్లను మార్చేందుకు 75 ఆధ్యాత్మిక పేర్లను టీటీడీ ఎంపిక చేసిందని, ఇప్పటికే 42 విశ్రాంతి గృహాల దాతలు పేర్ల మార్పునకు అంగీకరించారని తెలిపారు. మిగిలిన రెండు విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేస్తుందని, సైనిక్ నివాస్ పేరు విషయంలో ఇండియన్ ఆర్మీతో చర్చిస్తామని బోర్డు నిర్ణయించిందన్నారు. తిరుమలలో కాలం చెల్లిన వసతి గృహాల పునఃనిర్మాణానికి, మిగిలిన వాటి ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలు అందించేందుకు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను ప్రముఖ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించామన్నారు. ఆదాయంతో సంబంధం లేకుండా, నిర్వాహకుల సామర్థ్యాన్ని బట్టి కేటాయింపులు ఉంటాయని, త్వరలోనే టెండర్లను పిలుస్తామని తెలిపారు. అన్నప్రసాదాల నాణ్యతను పెంచేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌ను 12వేల చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు రిలయన్స్ రిటైల్ సంస్థ ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు రావడంతో వారితో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు.టీటీడీ విధానపరమైన నిర్ణయం ప్రకారం అన్యమతస్థులపై చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే టీటీడీలో ఉన్న 29 మంది అన్యమత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని ఈవో వెల్లడించారు. ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దు చేసి, ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీని నియమించినట్లు తెలిపారు. తిరుమల అటవీ ప్రాంతంలో పచ్చదనాన్ని 68 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, 2014లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మేరకు, ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం జరిగిందని, మిగిలిన నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు, 15 రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశామని, వారి ఆమోదం మేరకు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాల నిర్మాణం చేపడతామని ఈవో స్పష్టం చేశారు. టీటీడీ గోశాలలో గోసంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి, గోవులకు, లేగ దూడలకు నాణ్యమైన దాణా, పశుగ్రాసం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలో తిరునామధారణ కార్యక్రమాన్ని పునరుద్ధరించామని, శ్రీవారి సేవకులతో 18 ప్రాంతాల్లో ఇది నిరంతరం కొనసాగుతోందని తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com