ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి..పంజా విసురుతున్న మహమ్మారి

national |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 07:23 PM

భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజా మరణం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలోని థానే నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల యువకుడు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయి.. చికిత్స పొందుతూ మరణించినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై మరింత అప్రమత్తతను పెంచింది.


ముంబ్రాకు చెందిన ఈ 21 ఏళ్ల యువకుడు మే 22, 2025న థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. దురదృష్టవశాత్తు.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ వారం గ్రేటర్ ముంబైలో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయి మరణించిన నాల్గవ వ్యక్తి ఈ యువకుడు. ఈ నలుగురికి కూడా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు


సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు.


గత 10 రోజులుగా కోవిడ్-19 కేసుల సంఖ్యలో పెరుగుదల ఉన్నప్పటికీ.. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లోని వైద్యులు చాలామంది రోగులలో వ్యాధి తేలికపాటి లక్షణాలతోనే ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం.. ఈ పరిస్థితి అదుపులోనే ఉందని.. అక్కడక్కడ మాత్రమే కేసులు నమోదవుతున్నాయని.. అవి కూడా చాలా అరుదుగా ఉన్నాయన్నాయని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్‌లో సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ సురంజిత్ ఛటర్జీ తెలిపారు.


కర్ణాటకలోనూ మరణం


ఇటీవలే కర్ణాటకలోని బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణించాడు. శనివారం ఆయనకు కోవిడ్-19 పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయి. నగరంలోని వైట్‌ఫీల్డ్ నివాసి అయిన ఈ వృద్ధుడు మే 17న మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ ప్రకారం.. రాష్ట్రంలో 38 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.. వాటిలో 32 బెంగళూరులోనే ఉన్నాయి.


కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం, రాష్ట్రాలకు సూచనలు..


కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కర్ణాటక, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు సూచనలు జారీ చేశాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కోవిడ్-19 కేసులలో పెద్దగా పెరుగుదల లేదని.. అక్కడక్కడా మాత్రమే కేసులు నమోదవుతున్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు.


కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో నమోదైన కోవిడ్-19 కేసుల పరిస్థితిని సమీక్షించారు. నమోదవుతున్న కేసులలో చాలా వరకు తేలికపాటి లక్షణాలతోనే ఉన్నాయని.. వారు తమ ఇళ్లల్లోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.


మే 19 నాటికి భారతదేశంలో 257 ఆక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటిలో చాలావరకు తేలికపాటివి .. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేనివని తెలిపింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ICMR ద్వారా దేశం శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నిరంతరం పర్యవేక్షిస్తోంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.


ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది ఆరోగ్య శాఖ. కోవిడ్-19 ఇప్పుడు మరొక రకమైన వైరల్ ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించబడుతున్నప్పటికీ.. చేతుల పరిశుభ్రత పాటించడం, రద్దీ ప్రదేశాలలో మాస్కులు ధరించడం.. అనవసర సమావేశాలను నివారించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే దీని బారి నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa