70 ఏళ్లు పైబడిన వారికి ఇది నిజంగా గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. ఇకపై అనారోగ్యాలు వచ్చినా, ఆస్పత్రి ఖర్చుల గురించి భయపడాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ వయ వందన యోజన ద్వారా, మీకు సంవత్సరానికి రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా లభిస్తుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, ఈ కార్డుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. అక్టోబర్ 2024లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం, ఆయుష్మాన్ భారత్‌లో ఒక భాగం. దీని ద్వారా 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ వస్తుంది. ఈ కార్డు ఉంటే చాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకు ముందున్న వ్యాధులన్నింటికి కూడా కార్డు తీసుకున్న మొదటి రోజు నుంచే చికిత్స అందుతుంది. ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు.
మీ ఫోన్‌లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి, "Ayushman Bharat" యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ తెరిచి, మీరు బెనిఫిషియరీగా లాగిన్ అవ్వండి.
మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఇచ్చి, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి.
మీ రాష్ట్రం పేరు, ఆధార్ నంబర్ వంటి వివరాలు పేర్కొనండి.
ఒకవేళ మీ పేరు జాబితాలో లేకపోతే, eKYC ప్రక్రియను పూర్తి చేయండి. ఓటీపీ వస్తుంది, దానికి అనుమతి ఇవ్వండి.
అవసరమైన చోట మీ వివరాలు నింపి, డిక్లరేషన్ సమర్పించండి.
మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి.
మీ కేటగిరీ (వర్గం), పిన్ కోడ్ వంటి అదనపు వివరాలు ఇవ్వండి.
మీ కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన ఇతర సభ్యులు ఉంటే, వారి వివరాలను కూడా యాడ్ చేసి సబ్మిట్ చేయండి.
కార్డు డౌన్‌లోడ్: eKYC పూర్తై, మీ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, మీరు మీ ఆయుష్మాన్ వయ వందన కార్డును యాప్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు:
ఈ కార్డు ఉన్న సీనియర్ సిటిజన్లు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, ఆంకాలజీ, హెమోడయాలసిస్, టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్, టోటల్ నీ రీప్లేస్‌మెంట్ వంటి 1961 రకాల వైద్య విధానాలకు (ప్రొసీజర్స్), 27 మెడికల్ స్పెషాలిటీలలో నగదు రహిత చికిత్స పొందొచ్చు. ఇందులో గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, ఎముకలు, సర్జరీలు, డయాలసిస్ వంటి అనేక రకాల చికిత్సలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 13,352 ప్రైవేటు ఆస్పత్రులతో సహా మొత్తం 30,072 ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం గురించి ఇంకేమైనా వివరాలు కావాలంటే, 1800 11 0770 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ పథకం మన సీనియర్ సిటిజెన్లకు ఆర్థిక భారం లేకుండా మంచి వైద్యం అందేలా చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa