కడప వేదికగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని నారా లోకేష్ ఆరోపించారు. తల్లులను అవమానించారని.. తల్లిని, చెల్లిని మెడబట్టి బయటకు గెంటేశారంటూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. తల్లులను అవమానించిన వాళ్ల పరిస్థితి ఏమైందో అర్థమైందా రాజా అంటూ నారా లోకేష్ సెటైర్లు వేశారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వచ్చేసిన చంద్రబాబు.. విలేకర్ల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న ఘటన తెలిసిందే. అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వల్లభనేని వంశీ నారా భువనేశ్వరికి క్షమాపణలు కూడా చెప్పారు. తాను పొరపాటున వ్యాఖ్యలు చేశానని.. ఎమోషన్‌లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవమని అంగీకరిస్తూ నారా భువనేశ్వరికి క్షమాపణలు తెలియజేశారు. భువనేశ్వరిపై తన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
అయితే ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. చంద్రబాబు అసెంబ్లీ కౌరవసభ అని.. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానంటూ వచ్చేశారు. ఆ తర్వాత వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఈ ఘటనపై వాదోపవాదాలు అనేకం జరిగాయి. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది. గన్నవరం నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ ఓడిపోయారు. అయితే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ ఆరోపణలు, నకిలీ ఇళ్లపట్టాల కేసులలో వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్‌లో కొనసాగుతున్నారు. గత కొన్ని నెలలుగా వల్లభనేని వంశీ జైలులో ఉన్నారు. తాజాగా వల్లభనేని వంశీ ఆరోగ్య దెబ్బతిన్నదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహానాడులో ప్రసంగించిన నారా లోకేష్.. అప్పటి అసెంబ్లీ ఘటనను ప్రస్తావించడం.. తల్లిని అవమానిస్తే ఏమవుతుందో అర్థమవుతుందా రాజా అంటూ కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు మహానాడులో ప్రసంగించిన నారా లోకేష్.. తెలుగు ప్రజల కోసం తొలి నుంచీ పోరాడుతోంది తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు. మహానాడు కార్యక్రమంలో మొదటి రోజు నారా లోకేష్ ఆరు శాసనాలను ప్రతిపాదించారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, యువగళం, అన్నదాతకు అండగా, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరంగ్, కార్యకర్తలే అధినేత అంటూ ఆరు శాసనాలను నారా లోకేష్ ప్రతిపాదించారు. ఆ ఆరింటిని రాబోయే రోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఎత్తిన పసుపు జెండా దించుకుండా కార్యకర్తలు పోరాడారన్న నారా లోకేష్ వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు, ఓటములూ చూశామన్న నారా లోకేష్.. తమకు అధికారం, ప్రతిపక్షం ఏదీ కొత్తకాదన్నారు. మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa