దేశంలో మొట్టమొదటి ప్రయివేట్ హెలికాప్టర్ తయారీ ప్లాంట్ కర్ణాటకలో ఏర్పాటవుతోంది. ఐరోపాకు చెందిన దిగ్గజం ఎయిర్‌బస్, టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. కోలారు జిల్లా వెమ్‌గల్ ఇండస్ట్రియల్ ఏరియాలో H125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబుల్డ్ లైన్ (FAL) ప్లాంట్ సిద్ధం కానుంది. ఈ ప్లాంట్‌లో ఎయిర్‌బస్‌కు చెందిన ప్రముఖ H125 సివిల్ హెలికాప్టర్లు తయారవుతాయి. ఇది భారత్‌లో తొలి ప్రైవేటు హెలికాప్టర్ తయారీ కేంద్రమే కాదు.. ప్రపంచంలో ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్‌ల తర్వాత నాల్గో ప్లాంట్ కావడం విశేషం. మొదట ఏడాదికి 10 హెలికాప్టర్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని, రాబోయే రెండు దశాబ్దాల్లో 500 తేలికపాటి H125 హెలికాప్టర్ల తయారీ అంచనాలతో దశల వారీగా దీనిని విస్తరిస్తారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. టాటా సంస్థకు ఇప్పటికే బెంగళూరు సమీపంలో ఉపగ్రహ తయారీ యూనిట్ ఉండగా.. అదే ప్రాంతంలో హెలికాప్టర్ కేంద్రం ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నించింది. అనంతపురం ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని, ప్రోత్సహకాలు అందజేస్తామని చెప్పింది. కానీ, ఉప పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణంతో పాటు ఇప్పటికే ఉన్న TASL ఉనికి, తక్షణ అనుమతుల ప్రాధాన్యత వంటి ప్రభుత్వ హామీలు ప్రాజెక్ట్ ఏర్పాటులో కర్ణాటకవైపు మొగ్గుచూపాయి.
ఇప్పటికే టాటాసన్స్ ( TASL) వెమ్‌గల్ ఇండస్ట్రియల్ ఏరియాలో 7.4 లక్షల చదరపు అడుగుల స్థలం పొందింది. ఇందులో హెలికాప్టర్ తయారీ, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ కార్యకలాపాలు సాగుతాయి. ప్రాజెక్ట్‌లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం భూ రాయితీలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, 5 సంవత్సరాల పాటు వార్షిక టర్నోవర్‌పై 1% ఉత్పత్తికి అనుబంధ ప్రోత్సాహకాలు కల్పిస్తోంది.
ఎక్యూస్ (Aequs) సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ అరవింద్ మెల్లిగేరి మాట్లాడుతూ, ‘ఇలాంటి ప్రాజెక్టులు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా, ఆధునిక పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి పునాది వేస్తాయి’ అన్నారు. ‘ఇవి నైపుణ్య అభివృద్ధికి తోడ్పడి, సరఫరా వ్యవస్థలో పెట్టుబడులను ఆకర్షిస్తాయి.. ఇది భారత్‌ను ప్రపంచ స్థాయిలో పోటీ, వ్యూహాత్మకంగా కీలకమైన ఏరోస్పేస్ కేంద్రంగా మారుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదరలో టాటా– ఎయిర్‌బస్ సంస్థలు భాగస్వామ్యంతో C 295 విమానాల తయారీ ప్లాంట్ కూడా త్వరలోనే నెలకొల్పనున్నారi.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa