చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 'రెడ్ బుక్ రాజ్యాంగం' పేరుతో ఒక నూతన అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకుని ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తున్నారని విమర్శించారు. "మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది అని ఎన్నికలకు ముందే ప్రకటించారు. అదేదో మాటలకే పరిమితం అనుకున్నాం, కానీ ఇప్పుడు దాని పర్యవసానాలు చూస్తున్నాం," అని సజ్జల అన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల నమోదు చేసిన కేసు ఈ కోవలోకే వస్తుందని ఆయన పేర్కొన్నారు.ఏదైనా కేసులో ఆధారాలుంటే ఎంతవరకైనా వెళ్లవచ్చని, కానీ ఏమీ లేకుండా కల్పిత కథలు సృష్టించి, పాత్రలను తయారుచేసి, వాటిని తమ అనుకూల మీడియాలో రోజుల తరబడి ప్రచారం చేసి, ఆ తర్వాత వ్యక్తులను అరెస్టు చేసి కన్ఫెషన్లు రాయించుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. "పదేళ్ల క్రితం నాటి సంఘటనలను కూడా ఇప్పుడు తవ్వి తీసి, విష ప్రచారంతో ప్రజల మెదళ్లలోకి ఎక్కించి, కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు. ఇది సోషల్ మీడియా కార్యకర్తలతో మొదలై, నాయకుల వరకు పాకింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విధమైన అణచివేత చర్యల వల్ల నాయకులు, కార్యకర్తలు మరింత గట్టిగా తయారై వస్తున్నారని, వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. "ఒక నెల, రెండు నెలలు నాయకులను జైల్లో పెట్టొచ్చు. కానీ వారు బయటకు వచ్చేసరికి మరింత దృఢంగా మారుతున్నారు" అని తెలిపారు. పోలీసు వ్యవస్థ ఒకసారి గాడి తప్పితే, దానిని మళ్లీ దారికి తీసుకురావడం చాలా కష్టమని, ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని అన్నారు. తెనాలిలో జరిగిన ఘటనను, కావలి ప్రాంతంలో బహిరంగంగా అసభ్య నృత్యాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడాన్ని ఆయన ఉదహరించారు. "ఖాకీ డ్రెస్సులో గూండాయిజం కళ్ళ ముందు కనపడుతుంది. అధికారులు కొందరు ప్రభుత్వానికి తాబేదారులుగా మారి ఈ అరాచకాలకు సహకరిస్తున్నారు," అని సజ్జల దుయ్యబట్టారు.చంద్రబాబు నాయుడు ఈరోజు నాటుతున్న విత్తనాల వల్ల భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గ్రహించడం లేదని సజ్జల హెచ్చరించారు. "ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేందుకే ఈ టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. ఈ అరాచకాల మాటున దోపిడీ భయంకరంగా సాగుతోంది" అని ఆరోపించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులపై గురి పెట్టడం ద్వారా పార్టీని బలహీనం చేయాలని చూస్తున్నారని, అది అసాధ్యమని అన్నారు. "జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పట్టుదల, పటిమ ఉన్న నాయకుడిని, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. ఈ చర్యల వల్ల పార్టీ మరింత బలపడుతుంది. అందుకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు" అని సజ్జల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.తమ ప్రభుత్వ హయాంలో ఎవరిపైనైనా కేసులు పెడితే, పూర్తిస్థాయి దర్యాప్తు చేసి, ఆధారాలు లభించిన తర్వాతే చర్యలు తీసుకున్నామని సజ్జల గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసులు బనాయిస్తోందని విమర్శించారు. "కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మొదట బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆ తర్వాత అవి నిలబడవని తెలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పేలుడు పదార్థాల చట్టం వంటి కఠినమైన సెక్షన్లను జోడించారు" అని ఆరోపించారు. ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరో కేసు పెట్టి జైల్లోనే ఉంచేందుకు పీటీ వారెంట్లు ప్రయోగిస్తున్నారని, నందిగం సురేశ్ విషయంలో ఇలాగే జరిగిందని తెలిపారు.ఈ విధమైన అప్రజాస్వామిక పోకడలు ఎక్కువ కాలం సాగవని, ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సజ్జల అన్నారు. "ఒక పవర్ఫుల్ రాజకీయ పార్టీ నేతలనే ఇంత సులువుగా వేధించగలిగితే, ఇక సామాన్యులు, జర్నలిస్టులు, తమ గొంతు విప్పాలనుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది చాలా దారుణం," అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, వ్యవస్థలను గాడిలో పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa