ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శుభ్‌మన్ గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం నిజంగా ఒక కఠిన పరీక్ష

sports |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 07:37 PM

భారత టెస్ట్ క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగిన అనంతరం, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా కీలకమైన ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, గిల్‌పై ఎంతో బరువు బాధ్యతలు ఉన్నాయని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నారు.టీమిండియా జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనుంది. ఈ పర్యటన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త సీజన్‌కు శ్రీకారం చుట్టనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇంగ్లండ్ గడ్డపై యువ భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందనే దానిపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. గత ఏడాదే ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్టుల నుంచి తప్పుకోగా, స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఈ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. ఇవన్నీ భారత జట్టుకు కొంత ప్రతికూలాంశాలుగా మారాయి.ఇలాంటి కీలక సమయంలో, 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం నిజంగా ఒక కఠిన పరీక్ష అని చెప్పాలి. ఈ విషయంపై ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ, "టీమిండియాలో ఒక కొత్త శకం మొదలవడానికి ఇది సరైన తరుణం. యువ ఆటగాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలి. కొత్త టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌పై జట్టును ముందుకు నడిపించాల్సిన పెద్ద బాధ్యత ఉంది" అని అన్నారు. భారతదేశంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని, ఈ విషయంలో ఐపీఎల్ పాత్ర ఎంతో కీలకమని ఆయన ప్రశంసించారు. "ప్రతిభ ఉన్న ఎంతో మంది యువకులను ఐపీఎల్ వెలుగులోకి తెస్తోంది. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు తమ ఆటతీరులో గొప్ప పరిణతి కనబరిచారు" అని డివిలియర్స్ తెలిపారు.ఇంగ్లండ్‌లో టీమిండియా ఎదుర్కోబోయే సవాళ్ల గురించి కూడా డివిలియర్స్ ప్రస్తావించారు. "ఇంగ్లండ్‌తో వారి సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ ఆడటం అంత తేలికైన విషయం కాదు. కానీ, భారత ఆటగాళ్లలో ప్రతిభకు లోటు లేదు. వారు సంకల్పించుకుంటే ఏదైనా సాధించగలరు" అని ఆయన వివరించారు.విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంపై కూడా ఏబీ డివిలియర్స్ స్పందించారు. "కోహ్లీ తాను అనుకున్నది చేశాడు. చాలా సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడాడు. అదృష్టవశాత్తూ, మనం అతడిని ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మైదానంలో చూడగలుగుతున్నాం. అయితే, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం కోహ్లీని కచ్చితంగా మిస్ అవుతాం" అంటూ కోహ్లీని డివిలియర్స్ కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa