వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ విఫలమయ్యారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. చిన్నప్పుడే పదో తరగతి పరీక్షా పత్రాలు ఎత్తుకెళ్లిన వ్యక్తి నుంచి హుందాతనం ఆశించడం తమ తప్పేనని ఎద్దేవా చేశారు. యూనిఫాం నుంచి చిక్కీల వరకు అన్నింటికీ పార్టీ రంగులు, ఆయన పేరు తగిలించుకుని ఇప్పుడు విలువల గురించి మాట్లాడటం జగన్‌కే చెల్లిందని లోకేశ్ దుయ్యబట్టారు.గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల వల్ల విద్యారంగం తీవ్రంగా నష్టపోయిందని లోకేశ్ ఆరోపించారు. "ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని రద్దు చేసిన మీరు విద్యావ్యవస్థ గురించి మాట్లాడటమా అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టి, ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు" అని లోకేశ్ ప్రశ్నించారు.జీవో 117 వంటి నిర్ణయాల వల్ల ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తరలిపోయారని తెలిపారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను సన్నద్ధం చేయకుండానే వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక నిర్వహించిన పరీక్షలో 90 శాతం మంది విద్యార్థులు విఫలమయ్యారని గుర్తుచేశారు. పదో తరగతి ఫెయిల్ అయితే, ముఖ్యంగా ఆడపిల్లల చదువు ఆగిపోయి, వివాహాలు చేసే ప్రమాదం ఉందని, అందుకే సీబీఎస్ఈ విధానాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని వాయిదా వేశామని వివరించారు.జగన్ రెడ్డి ఐబీ విధానం తెచ్చానని కలలు కంటున్నారని, దాని అమలు నివేదిక కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారే తప్ప అమలు చేయలేదని లోకేశ్ విమర్శించారు. టోఫెల్ చెప్పే ఉపాధ్యాయులు లేకుండానే అమలు చేశానని గొప్పలు చెప్పుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. రూ.4500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, గుడ్ల నుంచి చిక్కీల వరకు రూ.1000 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వంపై మోపి వెళ్లారని ఆరోపించారు. జగన్ హయాంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం నాటి మంత్రి డబ్బులు వసూలు చేయడం బహిరంగ రహస్యమని, ఉన్నత విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చి వికృత క్రీడ ఆడారని దుయ్యబట్టారు. గ్రూప్-1 వంటి కీలకమైన ప్రశ్నపత్రాలను హైలాండ్ లాంటి ప్రైవేటు రిసార్టులో వాచ్‌మెన్లతో దిద్దించింది జగన్ కాదా అని ప్రశ్నించారు.ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగ ప్రక్షాళనకు కట్టుబడి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. "మీరు భ్రష్టు పట్టించిన వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నాను. టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపడుతున్నాం. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక మారుస్తున్నాం. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు లక్ష్యంగా పని చేస్తున్నాం. పుస్తకాల బరువు తగ్గించాం, విలువలతో కూడిన విద్య అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం" అని తెలిపారు.విద్యార్థులకు అందించే కిట్ల నుంచి అనేక పథకాలకు మహనీయుల పేర్లు పెట్టామని, ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించామని చెప్పారు. విశ్వవిద్యాలయాల పనితీరు మెరుగుపరిచేందుకు ఉత్తమ వ్యక్తులను వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తున్నామని వివరించారు.పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంపై వస్తున్న ఆరోపణలను లోకేశ్ ఖండించారు. ఈ ఏడాది 45,96,527 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయగా, రీ-కౌంటింగ్/రీ-వెరిఫికేషన్ తర్వాత 11,175 జవాబు పత్రాల్లో మాత్రమే మార్కుల్లో వ్యత్యాసం వచ్చిందని, ఇది కేవలం 0.25 శాతం మానవ తప్పిదమని, 99.75 శాతం కచ్చితత్వంతో మూల్యాంకనం జరిగిందని వివరించారు. ఈ ఏడాది 34,709 మంది విద్యార్థులు 66,363 స్క్రిప్టుల రీ-కౌంటింగ్/రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, 10,159 మంది విద్యార్థులకు చెందిన 11,175 స్క్రిప్టులలో వ్యత్యాసాలు గుర్తించి సరిచేశామని, బాధ్యులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.జగన్ హయాంలో 2022లో 20 శాతం, 2023లో 18 శాతం, 2024లో 17 శాతం స్క్రిప్టులలో వ్యత్యాసాలు వచ్చాయని, ఆ వివరాలు బయటపెట్టే ధైర్యం కూడా చేయలేదని విమర్శించారు. ఈ వాస్తవాలను మరుగునపెట్టి తమపై బురద చల్లడం సిగ్గుచేటన్నారు. రీ-వెరిఫికేషన్‌లో తేడాలు గుర్తించిన విద్యార్థులకు ఆర్జేయూకేటీలలో అడ్మిషన్లకు జూన్ 10 వరకు అవకాశం కల్పించామని, ఇతర అడ్మిషన్ల విషయంలోనూ సమయం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa