తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. భక్తులు బస్సులు, సొంత వాహనాల్లో కొండపైకి చేరుకుంటారు. మరికొందరు భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల నుంచి తిరుమలకు వస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు నడిచి వెళ్లాలంటే కనీసం గంటకుపైగా, కొందరికి 2 గంటల వరకు సమయం పడుతుందని చెబుతుంటారు. అందులో 40 ఏళ్ల పైబడిన వారు కొండపైకి ఎక్కాలంటే కొంత ఎక్కువ సమయమే పడుతుంది. అయితే తిరుపతి జిల్లా కలెక్టర్ మాత్రం తిరుమల కొండను కాలినడక మార్గంలో 50 నిమిషాల్లోని ఎక్కేశారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవాలని భావించారు. ఆయన శనివారం రోజు కాలినడకన శ్రీవారి మెట్టు మార్గం నుంచి బయల్దేరి తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో ఆహ్లాదకరమైన వాతావరణం చూసి తన మనసుకు ఎంతో ఆనందంగా అనిపించిందని.. ఇలా మెట్ల మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వెంకటేశ్వర్ కేవలం 50 నిమిషాల్లోనే చేరుకోవడంపై చర్చ జరుగుతోంది. ఆయన నడకదారిలో వెళ్లి తిరుమల శ్రీవారిన దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఫిట్‌నెస్‌తో ఉంటారని.. అందుకే ఆయన 50 నిమిషాల్లో తిరుమల కొండను ఎక్కేశారని చెబుతున్నారు. వాస్తవానికి కలెక్టర్లు పాలనాసరమైన అంశాలతో చాలా బిజీగా ఉంటారు.. ఆయనకు దొరికిన కాస్త సమయంలో ఇలా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చారు.. మళ్లీ తన పనుల్లో బిజీ అయ్యారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం 07.02 – 07.20 గంటల మద్య మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది. అంతకుముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీ గోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. మూలవిరాట్ తోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానంగా జూన్ 06న గరుడ వాహనం, జూన్ 09న రథోత్సవం, జూన్ 10న చక్రస్నానం జరుగనున్నాయి. వాహనసేవల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకునేలా చర్యలు చేపట్టారు. వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు(ఎల్ఇడి)లు ఏర్పాటు చేశారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణ కోసం తగినంత మంది శ్రీవారి సేవకులను కేటాయించారు. భక్తులకు అన్నప్రసాదాలు, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి 07 గంటల నుండి 9.00 గంటల వరకు పెద్దశేషవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. పెద్ద శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో శ్రీగోవిందరాజ స్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి ‘శేషశాయి’ అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు ప్రబోధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa