దేశంలోనే అత్యంత సంపద కలిగిన దేవాలయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఉన్న సంపద ఎంత ఉంది అనేది ఇప్పటివరకు లెక్కించనే లేదు. ఇక మన దేశంలో ఉన్న అత్యద్భుత ఆలయాల్లో కేరళ రాజధాని తిరువనంతపురం పట్టణంలో ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒకటి కావడం గమనార్హం. అయితే ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం.. అందులో ఉన్న బంగారం, నగదు, ఇతర ఖరీదైన వస్తువుల కారణంగా దేశవ్యాప్తంగా పేరు మారుమోగిపోయింది. ఇక ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దాదాపు 3 శతాబ్ధాల తర్వాత అరుదైన ఉత్సవం జరగనుంది. 270 ఏళ్ల తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
పద్మనాభ స్వామి ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మహా కుంభాభిషేకం క్రతువు ప్రధాన ఉద్దేశ్యం.. ఆధ్యాత్మిక శక్తిని పటిష్టం చేయడం, ఆలయ పవిత్రతను పునరుజ్జీవింపజేయడమేనని తేల్చి చెప్పారు. ఇన్ని 100 సంవత్సరాల తర్వాత ఇంతటి సమగ్ర పునరుద్ధరణ, పూజలు జరుగుతున్నాయని.. రాబోయే అనేక దశాబ్దాల్లో ఇది మళ్లీ జరగడం అరుదేనని ఆలయ మేనేజర్ బి. శ్రీకుమార్ వెల్లడించారు. ఈ మహా కుంభాభిషేకం క్రతువు జూన్ 8వ తేదీన ఆలయ ప్రాంగణంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా నిర్మించిన తళిక్కకుడమ్‌లు (గర్భగుడి పైన 3, ఒట్టక్కల్ మండపం పైన ఒకటి) ప్రతిష్ఠాపన.. విశ్వక్సేన విగ్రహం పునఃప్రతిష్ఠాపన.. ప్రధాన ఆలయ సముదాయంలో ఉన్న తిరువంబాడి శ్రీకృష్ణ ఆలయంలో అష్టబంధ కలశం వంటి వివిధ క్రతువులు జరుగుతాయని శ్రీకుమార్ వివరించారు.
2017లో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఆదేశాల ప్రకారం.. అనంత పద్మనాభ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాయి. అయితే ఆ వెంటనే పనులు ప్రారంభమైనప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా.. ఈ పనులు ఆలస్యం అయ్యాయి. ఆ తర్వాత 2021 నుంచి.. వివిధ పునరుద్ధరణ పనులు దశలవారీగా పూర్తైనట్లు ఆలయ వర్గాలు చెప్పాయి. వందల ఏళ్ల తర్వాత ఆలయంలో సమగ్ర పునరుద్ధరణ, సంబంధిత పూజలు జరుగుతున్నాయని ఆలయ మేనేజర్ శ్రీకుమార్ వెల్లడించారు. ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి మహా కుంభాభిషేకం వీక్షించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మనాభ స్వామి భక్తులకు ఒక అరుదైన అవకాశమని పేర్కొన్నారు. పద్మనాభ స్వామి ఆలయ శతాబ్దాల నాటి సంప్రదాయాలకు కట్టుబడి, పవిత్ర క్రతువులు సజావుగా జరిగేలా ఆలయ నిర్వహణ చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఆచార్య వరణం, ప్రసాద శుద్ధి, ధార, కలశం, ఇతర పూజలు జూన్ 8వ తేదీన జరిగే మహా కుంభాభిషేకంకు ముందు రాబోయే రోజుల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో జరుగుతాయని ఆలయ వర్గాలు తెలిపాయి. ఇక కేరళ రాజధాని తిరువనంతపురం పేరు శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి విడదీయరాని సంబంధం కలిగి ఉంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి సర్పదేవుడు అనంతపై శయనించి ఉంటారు. తిరువనంతపురం నగరం ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ అభివృద్ధి చెంది.. అక్కడ కొలువై ఉన్న అనంత అనే దేవత పేరు మీదుగా ఆ పేరు వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa