ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాలో శాంతి దిశగా అడుగులు.. అమెరికా షరతులకు తలొగ్గిన హమాస్

international |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 12:01 AM

ఏడాదిన్నరకు పైగా ఇజ్రాయేల్ భీకర దాడులతో అతలాకుతలమైన గాజాలో శాంతి నెలకునే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. బందీల విడుదల విషయంలో అమెరికా విధించిన షరతులకు హమాస్ అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు స్పందించినట్టు హమాస్ ప్రకటించింది. నిర్దిష్ట సంఖ్యలో పాలస్తీనా ఖైదీలు విడుదలకు బదులుగా.. 10 మంది బందీలను విడుదల చేయడానికి అంగీకిరించినట్టు తెలిపింది. అయితే, ఈ ప్రతిపాదనల్లో యుద్ధాన్ని పూర్తిగా ముగించాలన్న హమాస్ డిమాండ్ ఉండటంతో ఇజ్రాయేల్‌కు సవాలుగా మారింది.


‘ఈ ప్రతిపాదన శాశ్వత కాల్పుల విరమణ సాధించడమే కాక, గాజా నుంచి సంపూర్ణంగా ఇజ్రాయెల్ బలగాలను వెనక్కు పంపించేందుకు, మా ప్రజలకు మానవతాసాయం చేరేందుకు దోహదపడేలా ఉంది’ అని హామాస్ ఓ ప్రకటనలో తెలిపింది. హమాస్ ప్రాణాలతో ఉన్న 10 మంది బందీలు, మరో 18 బందీల మృతదేహాల అప్పగింతకు అంగీకరించింది. దీనికి బదులుగా ఇజ్రాయేల్ అనేక మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెడుతుంది. జాతీయ స్థాయి సంప్రదింపుల అనంతరం ప్రతిపాదనకు తాము అంగీకరించినట్టు హమాస్ పేర్కొంది.


అయితే, హమాస్ ప్రతినిధులు మార్పులు కోరలేదని అధికారిక ప్రకటనలో స్పష్టం చేసినా, ఒక పాలస్తీనా అధికారి రాయిటర్స్‌కి ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని సవరణలు కోరినట్టు తెలిపారు. ఈ ఏడాది జనవరి 19న ఇజ్రాయేల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా.. ఇది రెండు నెలల్లోనే ముగిసింది. దీంతో మార్చి నుంచి మళ్లీ ఇజ్రాయేల్ దాడులు మొదలయ్యాయి.


ఇజ్రాయెల్ స్పందన- డిమాండ్లు


ఈ ప్రతిపాదనలపై ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే దీనికి ముందు ఇజ్రాయేల్ మీడియా నివేదించిన ప్రకారం.. బందీల కుటుంబాలతో సమావేశమైన నెతన్యాహూ. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయేల్ అంగీకరించిందని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికీ అధికారిక ప్రకటన లేదు.


అయితే, హమాస్ పూర్తి నిరాయుధీకరణ, పాలనా శక్తిగా పునర్నిర్మాణానికి అంగీకారం, మిగిలిన 58 మంది బంధీల విడుదల తర్వాతే యుద్ధాన్ని ముగించాలనే స్థిరమైన వైఖరితో ఇజ్రాయేల్ ఉంది. హమాస్ మాత్రం ఆయుధాలు వీడబోమని, దీనికి బదులుగా ఇజ్రాయేల్ బలగాలు గాజా నుంచి వెనక్కు వెళ్లాలని, యుద్ధాన్ని ముగించాలనే హామీ ఇవ్వాలని స్పష్టంగా తెలిపింది. కాగా, మే 14న ఇజ్రాయేల్ జరిపిన దాడిలో గాజా హమాస్ చీఫ్ మహమ్మద్ సిన్వార్ హతమైన విషయం తెలిసిందే.


2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందగా, 251 మంది బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయేల్ ప్రారంభించిన సైనిక చర్యలో ఇప్పటివరకు 54,000 మందికి పైగా పాలస్తీనావాసులు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాజా పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రతిపాదన కొత్త ఆశలు కలిగిస్తున్నప్పటికీ, ప్రధాన విభేదాలపై ఇరువర్గాల దృక్పథాలు గట్టిగానే ఉన్నాయి. శాంతి దిశగా ఇది ముందడుగే అయినా, ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనేది కాలమే సమాధానం చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa