ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన ఐదో రోజు నుంచే భర్త హత్యకు పక్కా ప్రణాళిక..

national |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 02:15 PM

ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి మరీ భర్తను హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ యువతి, తన భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్ళింది. అక్కడే ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను హతమార్చేందుకు కుట్ర పన్ని, అమలు చేసింది. హత్య అనంతరం సోనమ్ అదృశ్యమవడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది. పోలీసులు తీవ్రంగా శ్రమించి, టూరిస్ట్ గైడ్‌లు, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా వంటి ఆధారాలను సేకరించి, ఈ మొత్తం కేసు వెనుక ఉన్న పూర్తి కథనాన్ని వెలికితీశారు. మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపగా, చివరికి హత్యకు కుట్ర పన్నింది భార్యేనని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో సోనమ్ రఘువంశీని పోలీసులు అరెస్ట్ చేసి, మేఘాలయకు తరలించారు. అనంతరం ఆమెను పాట్నాకు తరలించి, అక్కడి ఫుల్వారీ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు పాట్నా నుంచి గౌహతికి విమానంలో తరలించి, అక్కడి నుంచి మేఘాలయకు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణమైన హత్య వెనుక ఉన్న సంక్లిష్టమైన కుట్ర, సోనమ్, రాజ్ కుష్వాహా పాత్రలు సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. తొలుత తాను అమాయకురాలినని, ఎవరో తనను కిడ్నాప్ చేశారని సోనమ్ బుకాయించినా, పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు రావడంతో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ఇండోర్‌కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల పెళ్లి మే 11న జరిగింది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. అయితే, ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లయిన ఐదో రోజే, అంటే మే 16న, సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి తన భర్త హత్యకు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు తెలిపారు. 'రాజాను చంపేద్దాం.. కిడ్నాప్ నాటకం చేద్దాం. అప్పటికి నేను విదవగా మారతాను. నాన్న కూడా మన పెళ్లికి అంగీకరిస్తారు' అని సోనమ్ తన ప్రియుడు రాజ్‌తో చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ దారుణమైన ప్రణాళికలో భాగంగా, భర్తను హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి (డావ్)ని గువాహటిలోంచి ఆన్‌లైన్ ద్వారా తెప్పించారు. సంఘటనకు ముందు, నిందితులు సోనమ్ హోం స్టేకు 1 కిలోమీటర్ దూరంలోని ఒక హోటల్లో బస చేశారు. వారికి లొకేషన్ పంపించింది కూడా సోనమే. మే 23న ఫోటోషూట్ నెపంతో సోనమ్, రాజాను ఒంటరిగా ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్లింది. అదును చూసి 'చంపేయండి' అని ఆమె అరవడంతో, అక్కడే ఉన్న ముగ్గురు యువకులు రాజా రఘువంశీని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తర్వాత నిందితుడు విశాల్ చౌహాన్ రాజా తలపై కత్తితో గాయపరిచాడు. మరో నిందితుడు ఆకాశ్ రాజ్‌పుత్ దూరం నుంచి బైక్ మీద ఉండి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. మొదట నిందితులు ఈ పని చేయడానికి ఒప్పుకోలేదు. కానీ సోనమ్ వారికి రూ.20 లక్షలు ఇస్తానని ఆశ చూపడంతో అంగీకరించారు. ఈ వివరాలు పోలీసుల విచారణలో బయటపడటంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. మే 23న హత్య చేసిన అనంతరం అదే రోజు శిలాంగ్ నుంచి గువాహటికి వెళ్ళిన సోనమ్, అక్కడి నుంచి రైలు ఎక్కి వారణాసి మీదుగా గాజీపూర్‌కు పారిపోయింది. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు దారి మధ్యలో తన మొబైల్ ఫోన్‌లను కూడా ధ్వంసం చేసింది. అయితే పోలీసుల విచారణలో సోనమ్ సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. అందులో ఆమె నిందితులతో మాట్లాడుతున్న దృశ్యాలు ఉండటంతో పోలీసులకు కీలక ఆధారం లభించింది. తర్వాత కాల్ డేటా రికార్డ్స్ (CDR), కాల్ ట్రేసింగ్ ఆధారంగా రాజ్ కుష్వాహా స్థానికంగా ఉన్నట్లు తెలిసి, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోనమ్ తన 'గేమ్' ముగిసిందని అర్థం చేసుకుని, ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఢాబాలోకి వెళ్లి పోలీసులకు లొంగిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa