ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారుల పేరిట 1000 డాలర్లతో ప్రభుత్వ నిధి,,,బిల్లుకు సెనేట్ ఆమోదం

international |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 07:52 PM

అమెరికా గడ్డపై పుట్టిన చిన్నారుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌వినూత్న పథకాన్ని ప్రకటించారు. 2025-29 మధ్య జన్మించే ప్రతి చిన్నారి పేరిట 1,000 డాలర్ల (రూ.85,000) నిధితో ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ ఖాతాను ప్రభుత్వం ఉచితంగా తెరవసుంది.‘ట్రంప్‌ ఖాతా’ల పేరుతో ఈ పథకం ప్రారంభిస్తున్నారు. సోమవారం వైట్‌హౌస్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఉబర్‌, గోల్డ్‌మన్స్‌ సాక్స్‌, డెల్‌ టెక్నాలజీస్‌ వంటి సంస్థల సీఈవోలు ఈ సమావేశానికి హాజరయ్యారు


ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధుల సభ ఆమోదించిన ‘ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ లో భాగంగా దీనిని ప్రవేశపెట్టారు. అమెరికాలో జన్మించే ప్రతి శిశువుకి ఈ పథకం ద్వారా ఆర్థికంగా ముందడుగు వేయడానికి అవకాశం లభించనుంది. ఈ ట్రంప్ అకౌంట్లలో ప్రభుత్వం తరఫున ఒకేసారి 1,000 డాలర్లు డిపాజిట్ చేయనున్నారు. ఈ ఖాతాలను చిన్నారుల సంరక్షకులు ప్రైవేట్ ఆస్తిగా పరిగణిస్తారు ఇవి స్టాక్ మార్కెట్ సూచీ అనుసరిస్తూ పని చేస్తాయి. ప్రతి సంవత్సరం ప్రైవేట్‌గా గరిష్టంగా 5,000 డాలర్లు వరకు ఇందులో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల పిల్లలు చిన్న వయసులోనే పెట్టుబడి పరంగా ఎదగడం ప్రారంభమై, కౌమార దశ నాటికే ఆర్థిక స్థిరత్వం పొందే అవకాశం ఉంటుంది.


‘‘జనవరి 31, 2024 నుంచి డిసెంబర్‌ 31 2029 మధ్య జన్మించే అమెరికన్‌ పౌరులకు 1,000 డాలర్లను ట్యాక్స్‌ డెఫర్డ్‌ ఖాతాలో జమచేస్తారు’ అని ట్రంప్‌ తెలిపారు. ఈ అకౌంట్‌లను పిల్లల సంరక్షకులు నియంత్రిస్తూ.. 18 ఏళ్లు నిండే వరకు వడ్డీని అందులో జమ చేస్తారు. అన్నిరకాల ఆదాయ వర్గాల పిల్లలకు ఇది వర్తిస్తుంది. అయితే, చిన్నారి తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు వర్క్‌ఆథరైజేషన్‌, సోషల్‌ సెక్యూరిటీ నెంబర్‌ను అందజేయాల్సి ఉంటుంది. ఇక, ఈ పథకంపై దిగ్గజ వ్యాపార వేత్తలు, రాజకీయ వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. వలసదారుల విషయంలో ట్రంప్ వైఖరికి వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలుజరుగుతోన్న వేళ.. ఆయన ఈ పథకం ప్రకటించడం గమనార్హం.


డెల్ సీఈఓ మైఖేల్ డెల్: ‘ఈ ట్రంప్ అకౌంట్లు సాధారణమైనవి అయినప్పటికీ జీవితాలను మారుస్తాయి.. పిల్లలకు ఆర్థికంగా ముందుగానే అవకాశాలివ్వడం వారిని మంచి విద్య, వ్యాపార ప్రారంభం, గృహ స్వంతం వంటి విజయాల దిశగా నడిపిస్తుంది’ అని అన్నారు. గోల్డ్‌మాన్ సాక్స్ సీఈఓ డేవిడ్ సొలమన్: ‘ఈ ప్రణాళిక తరతరాల మధ్య బంధాన్ని ఏర్పరస్తుంది.. చిన్నారుల మీద పెట్టుబడి వేసే విధానం భవిష్యత్తులో గణనీయమైన లాభాలు ఇస్తుంది. దీన్ని మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం’ అని తెలిపారు.


ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి: “ప్రతి శిశువుకీ స్వంత భవిష్యత్తుపై హక్కు ఉండాలి. ఈ అకౌంట్లు వారి భవిష్యత్తుకు ప్రారంభమే కాదు, ఒక లాంచ్‌పాడ్ లాంటివి” అని పేర్కొన్నారు. ఆల్టిమీటర్ క్యాపిటల్ సీఈఓ బ్రాడ్ గెర్స్ట్‌నర్: “ఇది అమెరికాలోని ప్రతి శిశువును మార్కెట్ లాభాలతో అనుసంధానం చేస్తుంది. దీని ద్వారా మళ్లీ అమెరికా ఓ 'యాజమాన్య సొసైటీగా మారుతుంది” అని అభిప్రాయపడ్డారు.


స్పీకర్ మైక్ జాన్సన్: “401(k) ఖాతాలో పెట్టుబడి ఎలా పని చేస్తుందో అవగాన ఉన్నవారి ఇది పరిచయం. ట్రంప్ అకౌంట్లు అదే సిద్ధాంతాన్ని శిశువుల జీవితం ప్రారంభం నుంచి వర్తింపజేస్తున్నాయి.” అని చెప్పారు. హౌస్ వేస్ అండ్ మీన్స్ చైర్మన్ జేసన్ స్మిత్: “ఈ ఖాతాలు పిల్లలు నడక, మాటలు నేర్వకముందే వారి జీవితం కోసం డబ్బు మిగుల్చేలా చేస్తాయి. ఇది పట్టణం గ్రామం అనే తేడా లేకుండా ప్రతి శిశువు జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉంటుంది.” అని వ్యాఖ్యానించారు. ట్రంప్ అకౌంట్లు అనే ఈ వినూత్న ఆర్థిక పథకం అమెరికాలోని ప్రతి పుట్టే శిశువుకు ఆర్థిక భద్రతతో పాటు, పెట్టుబడి పట్ల అవగాహనను పెంపొందించే దిశగా ఒక కీలక ముందడుగు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa