ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మేడే’ అర్థమేంటి? ఏటీసీ, పైలట్ల మధ్య రేడియో కమ్యూనికేషన్‌లో వాడే పదాలేంటి

national |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 07:37 PM

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. గురువారం (జూన్ 12న) మధ్యాహ్నం 1.38 గంటల సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలుపుకొని మొత్తం 242 మంది ఉన్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. విమానంలో ఉన్నవారిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటిష్ జాతీయులు, పోర్చుగీస్‌కు చెందిన ఏడుగురు, కెనడాకు చెందిన ఒకరు ఉన్నారని ఎయిరిండియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించారు.


విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికులకు సంబంధించిన వివరాల కోసం 1800 5691 444 అనే హాట్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది. విమాన ప్రమాదానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు.


విమానం టేకాఫ్ అయిన కాసేపటికే.. గాల్లో 625 అడుగుల ఎత్తులో ఎగురుతుండగానే పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సెంటర్‌కు మేడే కాల్ చేశారు. వారిని సంప్రదించేందుకు ఏటీసీ తిరిగి ప్రయత్నించగా.. అట్నుంచి స్పందన లేకపోయింది. కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ నేపథ్యంలో పైలట్లు చేసిన ‘మేడే’ కాల్‌కు అర్థమేంటి..? విమాన సిబ్బంది ఎలాంటి కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు..? దానికి అర్థమేంటో చూద్దాం..


విమానం నడిపే పైలట్లు, ఏటీసీ మధ్య కమ్యూనికేషన్ చాలా కీలకమైంది. ఈ కమ్యూనికేషన్ కోసం వారు కొన్ని నిర్దిష్టమైన పదాలు, నియమాలు, సిగ్నల్స్ ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇవి ప్రామాణికమైనవి. ఏవియేషన్ రంగంలో కమ్యూనికేషన్ కోసం పైలట్లు, ఏటీసీ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది అందరూ ఇంగ్లిష్‌లోనే మాట్లాడతారు. దీనివల్ల విమానం ప్రపంచంలో ఏ ప్రాంతంలో ప్రయాణిస్తున్నా సరే.. భాష పరంగా ఇబ్బందులు ఉండవు.


అలాగే రేడియో కమ్యూనికేషన్ కోసం నిర్దిష్టమైన పదజాలాన్ని ఉపయోగిస్తారు. ఈ రేడియో కమ్యూనికేషన్‌ను ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఈ పదజాలాన్ని ప్రమాణీకరించింది. ఆ పదజాలంలోని కొన్ని పదాలు, వాటికి అర్థాలను ఇప్పుడు చూద్దాం..


⍟ రోజర్ (Roger): మీ సందేశాన్ని నేను అందుకున్నాను


⍟ అఫిర్మేటివ్ (Affirmative): అవును లేదా ధృవీకరిస్తున్నాను


⍟ నెగెటివ్ (Negative): కాదు లేదా తిరస్కరిస్తున్నాను


⍟ రీడ్‌బ్యాక్: ATC సూచనలను పైలట్ తిరిగి చెప్పడం, తద్వారా ఆ సూచనను సరిగ్గా అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవడం.


⍟ క్లియర్డ్ ఫర్ టేకాఫ్: టేకాఫ్ చేయడానికి అనుమతి ఉందని అర్థం


⍟ లైన్ అప్ అండ్ వెయిట్: రన్‌వే పైకి వచ్చి టేకాఫ్ కోసం వేచి ఉండమని అర్థం


⍟ బ్రేక్స్ రిలీజ్డ్: టేకాఫ్ కోసం బ్రేకులను వదిలి, విమానం కదలడం ప్రారంభించిందని పైలట్ ఏటీసీకి చెప్పడం.


⍟ మేడే (Mayday): తీవ్రమైన, ప్రాణాపాయ అత్యవసర పరిస్థితిని సూచించే సంకేతం. ఉదా: ఇంజిన్ వైఫల్యం, మంటలు. మూడు సార్లు మేడే.. మేడే.. మేడే అంటారు.


⍟ పాన్-పాన్ (Pan-Pan): తక్షణ ప్రాణాపాయం ఉండదు, కానీ అత్యవసరమైన పరిస్థితిని సూచిస్తుంది. ఉదాహరణకు చిన్నపాటి సాంకేతిక సమస్య, లేదా విమానంలో ఎవరైనా అనారోగ్యానికి గురికావడం. దీనిని కూడా మూడు సార్లు పునరావృతం చేస్తారు.


మేడే అనేది ఫ్రెంచ్ పదమైన మెయిడేర్ నుంచి వచ్చింది. అత్యవసర సాయం కావాలని లేదా హెల్ప్ మీ అని దీని అర్థం.


రేడియో కమ్యూనికేషన్స్‌లో అక్షరాలు లేదా సంఖ్యలను స్పష్టంగా తెలియజేయడానికి ఫోనెటిక్ ఆల్ఫాబెట్ ఉపయోగిస్తారు. అపార్థాలు, తప్పిదాలు దొర్లకుండా చూడటానికి దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా రేడియో సిగ్నళ్లు బలహీనంగా ఉన్నప్పుడు లేదా శబ్దాలు తీవ్రంగా ఉన్నప్పుడు దీన్ని ఉయోగిస్తారు. ఉదా: A - ఆల్ఫా, B - బ్రావో, C - చార్లీ... ఈ ఫోనెటిక్ ఆల్ఫాబెట్‌లో అంకెలను కూడా నిర్దిష్టంగా పలుకుతారు. త్రీని ట్రీ అని.. నైన్‌ను నైనర్ అని పలుకుతారు.


గ్రౌండ్ ఆపరేషన్స్ (గ్రౌండ్ కంట్రోల్, ఇంజనీర్లు), పైలట్లు చేతులు కదిలించడం లాంటి నాన్ వెర్బల్ సిగ్నల్స్ కూడా ఉపయోగిస్తారు. ఇవి విమానం కదలికలు, ఇంజిన్ స్టార్ట్ చేయడం లేదా ఆపడం, బ్రేకులు వేయడం లాంటి వాటికి సంబంధించినవి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa