ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానంలో ఏ సీటు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 08:04 PM

విమానాల్లో ఏ సీటులో ప్రయాణిస్తే.. ప్రమాదాలు జరిగినపుడు సురక్షితంగా ఉంటాం అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే విమానాలు భారీ కుదుపులకు లోను కావడం.. ఒక్కోసారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం.. పక్షులు అడ్డుగా రావడం వల్ల అప్పుడప్పుడు ప్రయాణికులు గాయపడుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు జరిగినపుడు, ఏకంగా విమానం కూలిపోయినపుడు ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఏ సీటులో కూర్చుంటే.. ప్రమాద తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు అనేది ఇప్పుడు చాలా మంది ప్రయాణికుల్లో చర్చ జరుగుతోంది. అయితే గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న విమానం.. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు రన్ వే పైనుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో ఒకే ఒక్కడు ప్రాణాలు దక్కించుకుని బయటపడగా.. పైలట్లు, సిబ్బంది సహా మిగిలిన 241 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలోనే విమానంలో ఏ సీటు సేఫ్ అనే చర్చ జరుగుతోంది.


అయితే దీని గురించి కొన్ని అధ్యయనాలు చేసి.. నిపుణులు కొన్ని విషయాలు వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం విమాన ప్రయాణం అత్యంత సురక్షితమైన రవాణా మార్గాలలో ఒకటి అని.. వాణిజ్య విమాన ప్రయాణంలో మరణించే అవకాశం చాలా తక్కువ అంటే.. 1.37 కోట్ల మంది ప్రయాణికుల్లో ఒకరు మాత్రమే చనిపోతున్నారు. అయినప్పటికీ ఇటీవల జరిగిన కొన్ని అరుదైన విమాన ప్రమాదాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఘటనలు చోటు చేసుకోవడంతో విమానంలో సీటు భద్రతకు సంబంధించిన ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే కొన్ని ప్రమాద పరిస్థితుల్లో ఏ సీటులో కూర్చున్నాం అనేది కూడా సురక్షితంగా బయటపడటంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు, ఏవియేషన్ నిపుణులు సూచిస్తున్నారు. విమానంలో ప్రయాణించేటపుడు ఎల్లప్పుడూ సీట్‌బెల్ట్ ధరించాలని.. సూచిస్తున్నారు. విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా కుదుపులకు లోనవుతుందని.. అఫ్పుడు గాయపడే ప్రమాదం ఉందని.. అలాంటప్పుడు సీట్‌బెల్ట్ పెట్టుకోవడం వల్ల దాన్ని తప్పించుకోవచ్చని చెబుతున్నారు.


విమానం వెనుక భాగంలో అత్యంత సురక్షితమైన సీటు


2015లో టైమ్ పత్రిక ఎఫ్‌ఏఏ డేటాపై చేసిన విశ్లేషణ ప్రకారం.. విమానంలో వెనుక మూడో భాగంలో కూర్చున్న ప్రయాణికుల మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో తలెత్తే సమస్యల్లో విమానం ముందు భాగం ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వెనుక సీట్లను కాస్త సురక్షితంగా ఉంచుతుంది. ఏవియేషన్ సేఫ్టీ రీసెర్చర్ డేనియల్ క్వాసి అడ్జెక్వం.. ఈ విషయాన్ని సమర్థిస్తూ.. విమాన నిర్మాణ వైఫల్యం తరచూ ముందు భాగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వివరించారు.


రెక్కల వద్ద సీట్ల వల్ల అదనపు ప్రయోజనం


న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెంగ్ లుంగ్ వు ప్రకారం.. విమానం రెక్కల సమీపంలో ఉండే సీట్లు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కొంత ప్రయోజనకరంగా ఉంటాయి. విమానంలోని రెక్కల భాగాన్ని దాని స్థిరత్వం కోసం ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా రెక్కల వద్ద ఉండే సీట్లు సాధారణంగా ఎమర్జెన్సీ డోర్లకు చాలా దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినపుడు.. 90 సెకన్లలో విమానం నుంచి ప్రయాణికులు కిందికి దిగి పోవాలనే సమయంలో తొందరగా తప్పించుకునే అవకాశాలు ఉంటాయి.


మెట్ల డోర్ వరుసలో కూర్చోవడం


సాధారణంగా విమానానికి సంబంధించి.. మెట్ల డోర్ ఉండే వరుసలో కూర్చోవడం కూడా ఏదైనా ప్రమాదం జరిగినపుడు ప్రాణాలతో బయటపడే అవకాశాలను మరింత పెంచుతుందని ఏవియేషన్ రంగ నిపులు తెలుపుతున్నారు. అయితే ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినపుడు.. మనం బయటపడటమే కాకుండా విమానంలోని ఇతరులకు సహాయం చేసే మానసిక, శారీరక సామర్థ్యం ఉండాలి. ఇక ఈ ఎగ్జిట్ డోర్ వద్ద ఉండే ఈ వరుసలు సాధారణ వరుసల కంటే విశాలంగా ఉండి వేగంగా బయటికి వెళ్లేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు.


విండో vs ఐల్ vs మిడిల్ సీటు


అయితే ఈ విషయంలో సమాచారం చాలా తక్కువగా అందుబాటులో ఉంది. అయితే విమానం మధ్యలో ఉండే సీట్లు ప్రమాద సమయంలో కొద్దిగా ఎక్కువ రక్షణను అందిస్తాయని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏ ప్రమాదం జరిగినా ముందూ, వెనక భాగాలు ప్రభావితం అయి.. మధ్య భాగం కాస్త తక్కువగా దెబ్బతింటుందని చెబుతున్నారు. విమానంలో సీట్ల మధ్య ఉండే కారిడార్‌కు ఇరు వైపులా ఉండే ఐల్ సీట్లలో కూర్చున్న వారు.. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి త్వరగా ఖాళీ చేయడానికి సులభంగా ఉంటాయని పేర్కొంటున్నారు. కానీ విమానం కుదుపులకు లోనైనపుడు ప్రయాణికులకు మరింత ఎక్కువగా గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కిటికీ పక్కన సీట్లలో కూర్చుంటే పొగ లేదా అగ్ని ప్రమాదం సంభవించినపుడు తొందరగా ఖాళీ చేయడం కష్టం అవుతుంది.


ఇంధన ట్యాంకులు, అగ్ని ప్రమాదం


విమానం రెక్కల వద్ద ఉండే సీట్ల కింద.. దాన్ని ఇంధన ట్యాంకులు ఉంటాయి. కొన్ని ప్రమాదాలు జరిగినపుడు అది అగ్ని ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు చేసే సమయంలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సాధారణంగా విమానంలోని ఇంధనం మొత్తాన్ని గాల్లోకి విడుదల చేస్తారు. అయినప్పటికీ మిగిలిన ఇంధనం ద్వారా మంటలు అంటుకోవడం, పొగ రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెక్కల వద్ద కూర్చున్న ప్రయాణికులు తొందరగా ఖాళీ చేయడం చాలా కీలకం.


సిట్యుయేషనల్ అవేర్‌నెస్


వీటన్నింటి కన్నా ముఖ్యం ఏంటంటే విమానంలో ఎక్కడ కూర్చున్నా అలర్ట్‌గా ఉండటమే. ఏదైనా ప్రమాదం జరిగినపుడు ఎంత తొందరగా స్పందిస్తే.. అంత ఎక్కువగా ప్రాణాలు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విమానంలో సిబ్బంది చెప్పే భద్రతా సూచనలను విని.. ఎమర్జెన్సీ రూల్స్‌కు సంబంధించిన వివరాలను కచ్చితంగా చదవాలి. మరీ ముఖ్యంగా సీట్‌బెల్ట్‌ను బిగించుకోవడం తప్పనిసరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa