ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఒకట్రెండు రోజుల్లో విమాన ప్రమాదం’.. జర్నలిస్ట్ ఫేస్ బుక్ పోస్టు.. ఎడిట్ చేశారా? నిజమేనా?

national |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 08:06 PM

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 200 మందికిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. దీంతో వైద్య విద్యార్థులు సైతం మరణించారు. ఎంత మంది మరణించారనే విషయాన్ని భారత ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. కానీ ఇప్పటి వరకూ ఈ ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అతడు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.


టేకాఫ్ అయిన కొద్ది సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్షులు ఢీకొట్టడం వల్ల ఇంజిన్లు విఫలమై కూలిపోయిందా? లేదంటే ఓవర్ లోడ్ కారణమా? ఇతరత్రా కారణాలు ఉన్నాయా? లేదంటే మానవ తప్పిదం కారణమా అనేది తేలాల్సి ఉంది. బ్లాక్ బాక్స్‌లోని సమాచారాన్ని డీకోడ్ చేస్తేనే ప్రమాదానికి కారణమేంటనేది తెలుస్తుంది. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందేమో అని కూడా కొందరు అనుమానిస్తున్నారు.


మరి కొద్ది రోజుల్లో ప్రమాదాలు జరగొచ్చు అంటూ జ్యోతిష్యులు తమ అంచనాలను వెల్లడించడం, వారి అంచనాలు కొన్నిసార్లు నిజం కావడం మనం చూస్తూనే ఉంటాం. అహ్మదాబాద్ ప్రమాదాన్ని కూడా ఓ ఆస్ట్రాలజర్ ముందే ఊహించారంటూ కథనాలు వచ్చాయి.


అయితే తాజాగా బిహార్ రాజధాని పాట్నాకు చెందిన మొదస్సిర్ మహమూద్ అనే జర్నలిస్ట్ ఒకట్రెండు రోజుల్లో విమాన ప్రమాదం జరగొచ్చంటూ రెండ్రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినట్లు ఉన్న పోస్టు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టు స్క్రీన్ షాట్లను పోస్టు చేసిన కొందరు నెటిజన్లు ఏదో తేడాగా ఉందంటూ పోస్టులు చేస్తున్నారు.


సదరు జర్నలిస్ట్ ఫేస్ బుక్ ఖాతాకు వెళ్లి చూడగా అలాంటి పోస్టు ఏమీ కనిపించలేదు. ‘పాకిస్తాన్ మీదుగా పాట్నా వైపు వీచే వేడి గాలులు మనల్ని ఇబ్బంది పెడతాయి’ అని తాను చేసిన గతంలో ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టును ఎవరో తప్పుగా ఎడిట్ చేసి.. విమానం కూలుతుందని అంచనా వేసినట్లు ముడిపెట్టి ట్విటర్లో దుష్ప్రచారం చేస్తున్నారని మొదస్సిర్ మహమూద్ జూన్ 13న ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా వివరణ ఇచ్చారు. వడగాలుల పోస్టును కూడా తాను డిలీట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


అక్కడితో ఆగకుండా.. ‘జూన్ 7 తర్వాత ఇండియా సహా చాలా దేశాల్లో విమాన ప్రమాదాలు జరుగుతాయి’ అంటూ గోపాల్ వ్యాస్ అనే మరో వ్యక్తి ఫేస్ బుక్‌లో చేసిన పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను మొదస్సిర్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే పాట్నా జర్నలిస్ట్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ఆధారంగా గోపాల్ వ్యాస్ ఫేస్ బుక్ ఖాతాకు వెళ్లి చూడగా.. ఆ స్క్రీన్ షాట్‌లో పూర్తి వివరాలు లేవని తెలిసింది.


‘జూన్ 7 తర్వాత భారత్ సహా చాలా దేశాల్లో విమాన ప్రమాదాలు జరుగుతాయి. చాలా సంఘటనలు చోటు చేసుకుంటాయి. భారత్, అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే దేశాల్లో చాలా పెద్ద, ప్రముఖ వ్యక్తి (పెద్ద ఆర్మీ అధికారి) చనిపోతారు’ అంటూ గోపాల్ వ్యాస్ మే 31న పోస్టు చేశారు.


ఇవాళ జరిగిన ప్రమాదం గురించి ఇతడికి రెండ్రోజుల ముందే తెలిసింది? అంటూ కొందరు నెటిజన్లు ప్రధాని కార్యాలయం, హోం మంత్రి కార్యాలయం, ఎన్ఐఏ, బిహార్ పోలీస్, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు చేశారు. మొదస్సిర్ పాట్నాకు చెందిన జర్నలిస్ట్ అని కూడా ఆ యూజర్ పేర్కొన్నారు. దీంతో స్పందించిన బిహార్ పోలీసులు.. పాట్నా పోలీసులను ట్యాగ్ చేయగా.. వారు పాట్నా సైబర్ పోలీసు అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. మొదస్సిర్ ఫేస్ బుక్ ఖాతా యాక్టివ్‌గా ఉండగా.. ఎక్స్ ఖాతా తొలగించినట్లు చూపిస్తోంది. పాట్నా జర్నలిస్ట్ పోస్టును ఎడిట్ చేసి తప్పుగా చిత్రీకరిస్తున్నారా? లేదంటే అతడు నిజంగానే ఆ పోస్టు చేసి, తర్వాత డిలీట్ చేసి అబద్దాలు చెబుతున్నాడా? అనేది సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో తేలనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa