ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్, కరెంట్ ఉండదు.... ఆ ఊరి ప్రత్యేకతే వేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 06:38 PM

పొద్దున్నే ఫేస్‌బుక్, మధ్యాహ్నం మెసెంజర్, సాయంత్రం షేర్ చాట్.. రాత్రికి ఇన్‌స్టాగ్రామ్.. ఇదీ నేటి యువత క్రమం తప్పకుండా ఫాలో అయ్యే డైలీ షెడ్యూల్.. ఇక మహిళల సంగతికి వస్తే.. పనులన్నీ ముగించుకుని మధ్యాహ్నమనగా మొదలుపెడితే.. రాత్రి శ్రీవారు ఇంటికి వచ్చేవరకూ.. సీరియళ్లే జీవితం.. అందులోని పాత్రధారులే, నేస్తాలు.. ఇక పురుషుల సంగతి వేరేగా చెప్పక్కర్లేదు.. ఉద్యోగస్తులైతే డ్యూటీ టెన్షన్, వ్యాపారస్తులైతే వారిదో టెన్షన్.. మొత్తానికి అందరిదీ మనీ టెన్షన్. రూపాయి సంపాదనలో.. దాని వెనుక పరిగెడుతూ రూపాయి దొరికేసరికి మన రూపాలే మారిపోయే పరిస్థితి. కానీ.. నో ఫోన్, నో కరెంట్, నో టీవీ, నో మనీ.. ఇలాంటివన్నీ లేని ఊరొకటి ఉందంటే నమ్ముతారా.. భలేవారండీ బాబూ.. సెల్లు లేని ప్రపంచం ఒకటి ఉంటుందా అని నోరెళ్లబెడతారా.. కానీ నమ్మలేకపోయినా, నిజమా అని నోరెళ్లబెట్టినా.. అలాంటి ఊరొకటి ఉంది.. అదెక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్‌లోనే..


శ్రీకాకుళం జిల్లా హిరమండలం కూర్మ గ్రామం .. బాహ్య ప్రపంచపు వాసనలకు దూరంగా, గజిబిజి పరుగులు, సెల్ ఫోన్ లొడలొడలు, టీవీ సీరియళ్ల గోలకు దూరంగా.. అదో ఆధ్మాత్మిక ప్రపంచం.. వారిదో ప్రత్యేకమైన జీవన విధానం. అంతకాపల్లి అడవుల్లో ఈ కూర్మ గ్రామం ఉంటుంది. ఇక్కడ టీవీల గోల ఉండదు. సెల్ ఫోన్ రింగ్ టోన్ల బెడద అస్సలు ఉండదు. అంతా ఎందుకు ఇక్కడ కరెంట్ అనేదే ఉండదు. ఆధునిక హంగులూ, ఆర్భాటాలకు దూరంగా, ప్రకృతి ఒడిలో, ఆధ్యాత్మిక చింతనతో ఇక్కడి వారు జీవిస్తుంటారు. అలా అని వీరంతా చదువుకోనివారో, అడవి బిడ్డలో కాదు. ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేసినవారే.. అయితే రూపాయి సంపాదనే జీవిత పరమార్థం కాదని.. అంతకుమించి వేరే ఉందని, ఆ అన్వేషణ మార్గంలోనే సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఇక్కడ జీవిస్తున్నారు.


2018లో ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తి వేదాంతస్వామి ప్రభుపాద ఆదేశాలతో భక్తివికాస్ స్వామి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు, ఇన్ఫోసిస్, విప్రో వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసిన వారు కూడా ఆధునిక జీవితాన్ని వదిలి, ఆధ్యాత్మిక గురువు సూచనల మేరకు కూర్మ గ్రామంలో.. గ్రామీణ జీవనశైలిని అనుసరిస్తున్నారు. సరళ జీవనం, ఉన్నత చింతనం వీరి విధానం. ఉదయం 3:30 గంటలకు లేచి, హారతి, భజనలతో రోజును ప్రారంభిస్తారు. రాత్రి 7 గంటల 30 నిమిషాలకల్లా నిద్రకు ఉపక్రమిస్తారు. అలాగే ఇక్కడి ఇళ్లు సిమెంట్, ఇనుము లేకుండా కేవలం ఇసుక, సున్నం, బెల్లం మిశ్రమంతో నిర్మించుకున్నారు. మనిషికి అవసరమైన కూడు, గూడు, గుడ్డను ప్రకృతి నుంచే పొందవచ్చనే భావనతో.. తమకు అవసరమైన ఆహారం, దుస్తులు, ఉన్ని వంటివి స్వయంగా ఉత్పత్తి చేసుకుంటారు. ఎలాంటి సబ్బులు, డిటర్జెంట్లు వాడకుండా సహజంగా దొరికే కుంకుడు కాయ లాంటి వాటితోవే తమ దుస్తులను శుభ్రం చేసుకుంటారు.


 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కూర్మ గ్రామంలో 60 మందికిపైగా నివశిస్తు్న్నారు. అలాగే ఇక్కడ నంద గోకులం గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో గోశాల, వైదిక గురుకులం నిర్వహిస్తున్నారు. ఈ గురుకులంలో విద్యార్థులకు భక్తి వృక్ష, భక్తి శాస్త్రి, భక్తి వైభవ్ వంటి కోర్సులను నేర్పుతారు. ఇక్కడి గురుకులంలోని విద్యార్థులు తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేస్తారు. నాలుగున్నరకు ఇచ్చే మంగళ హారతితో వీరి దినచర్య ప్రారంభమవుతుంది. ఆ తర్వాత గంటపాటు జపం ఆచరిస్తారు. గురుపూజ, పుస్తకాలు చదవటం వంటివి పూర్తి చేస్తారు. ఉదయం 9 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయి. గణితం, సైన్స్, సంస్కృతం, హిందీ, తెలుగు, ఆంగ్లం, శాస్త్రాలు, ఆర్ట్స్, మహాభారతం, చరిత్ర వంటివి నేర్పిస్తారు. శారీరక ఆటలు, ఈత, కబడ్డీ వంటివి కూడా అందులో భాగం.


గ్రామంలోని వారంతో ఉమ్మడిగా సేద్యం చేస్తారు. విత్తడం దగ్గర నుంచి కోతల వరకూ అందరూ కలిసి పనిచేస్తారు. ప్రకృతి సేద్యం విధానంలో తమకు అవసరమైన కూరగాయలు, ఇతరత్రా పంటలు పండించుకుంటారు. వైదిక సంస్కృతి, సనాతన ధర్మం, వర్ణాశ్రమ విధాన పునఃస్థాపన లక్ష్యంగా కూర్మ గ్రామంలోని వారు జీవిస్తున్నారు. వ్యవసాయం, గోవుల మీద ఆధారపడి ఇక్కడివారు జీవిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa