ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీట్‌లో మెరిసిన నిరుపేద విద్యార్థి

national |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 06:58 PM

ఆ యువకుడిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. తల్లీదండ్రులు నిత్యం ఏదో ఒక పనిచేస్తేనే పూట గడుస్తుంది. ఇక ఆ యువకుడు ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల విడుదలైన నీట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఓబీసీ కేటగిరీకి చెందిన ఆ యువకుడు.. పనిచేస్తూనే నీట్‌లో మెరిశాడు. ఈ విషయం తెలుసుకుని అతడి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. తాను భవిష్యత్‌లో డాక్టర్ అయి.. తన ఊరికే సేవ చేయాలని ఉందని ఆ యువకుడు పేర్కొన్నాడు. నిత్యం కష్టనష్టాలు పడే ఆ కుటుంబం.. యువకుడు సాధించిన విజయానికి ఆ కష్టాన్ని మర్చిపోయారు. రాజస్థాన్‌లోని మారుమూల గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ సక్సెస్ కష్టాల సాగరంలో శ్రావణ్ విద్యాప్రస్థానం


రోజు పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి ఆ కుటుంబానిది. శ్రావణ్ తల్లిదండ్రులు గ్రామంలో జరిగే వివాహ వేడుకలు, శుభకార్యాల్లో వంటపాత్రలు కడగటం, లైట్లు పట్టుకోవడం వంటి చిన్నపాటి కూలీ పనులు చేస్తుంటారు. శ్రావణ్ (19) కూడా దగ్గర్లోనే ఉన్న ఓ కంపెనీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇదే వారి నిత్య జీవితం. రాజస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామం, చిన్న రెండు గదుల మట్టి ఇల్లు, కరెంటు కూడా లేని దయనీయ పరిస్థితి. కానీ, ఈ కుర్రాడు సాధించిన గొప్ప విజయం ఇప్పుడు ఆ రాష్ట్రమంతా మారుమోగిపోతుంది.


శ్రావణ్ ఇటీవల నీట్ మెడికల్ ఎగ్జామ్ రాశాడు. అందులో ఓబీసీ కేటగిరీలో 4071వ ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లక్షలు ఖర్చు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్‌లు తీసుకున్నా సాధ్యం కాని ఈ ఘనతను.. శ్రావణ్ కేవలం ఇంటి వద్ద పని చేస్తూ, తనకున్న పరిమిత వనరులనే వినియోగించుకుంటూ సాధించాడు. నీట్ 2025 పరీక్షలో అద్భుతాన్ని సృష్టించాడు. ఇప్పుడు కచ్చితంగా రాజస్థాన్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే సీటు వచ్చే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.


సాంకేతికతతో వచ్చిన మలుపు


శ్రావణ్‌ది చిన్న ఇల్లు, అది కూడా మట్టి ఇల్లు.. పైగా కరెంటు కూడా ఉండేది కాదంట. అలాంటిది 2022 చివరిలో అతడి ఇంటికి కరెంట్ కనెక్షన్ వచ్చింది. అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని శ్రావణ్ అంటున్నాడు. ఆ తర్వాత అతడి తల్లికి ప్రభుత్వ పథకం కింద ఉచిత స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం కూడా లభించాయి. ఇది శ్రావణ్‌కు ఎంతోగానో ఉపయోగపడింది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో నీట్ ప్రిపేర్ అవ్వడానికి ఎంతో సాయపడిందని అంటున్నాడు. అలాగే బార్మర్‌లోని ప్రభుత్వ వైద్యులు అందించిన ఉచిత నీట్ కోచింగ్ కూడా ఈ ర్యాంకు సాధించడానికి ఎంతోగానో సాయం అయ్యిందని శ్రావణ్ కృతజ్ఞతలు తెలిపాడు.


శ్రావణ్ భవిష్యత్ లక్ష్యం: వైద్యుడిగా పల్లెకు సేవ


22 లక్షలకు పైగా పాల్గొన్న ఈ పరీక్షల్లో కేవలం 55,688 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఓబీసీ కేటగిరీలో శ్రావణ్ 4071వ ర్యాంకు సాధించాడు. శ్రావణ్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. అలా 10వ తరగతిలో 97 శాతం మార్కులు సాధించగా.. ఇంటర్‌లో 88 శాతం మార్కులు సాధించాడు. వైద్యుడిగా మారి తన గ్రామం లాంటి మారుమూల పల్లెటూర్లకు సేవ చేయాలని శ్రావణ్ ఇప్పుడు కలలు కంటున్నాడు. అక్కడ వైద్య సహాయం తరచుగా అందుబాటులో ఉండదని అలాంటి చోటే తాను వైద్యుడిగా పని చేస్తానని అంటున్నాడు. పెద్ద డాక్టర్ అయ్యాక.. తన తల్లిదండ్రుల కోసం మంచి ఇల్లు నిర్మిస్తానని, ఇక వారు పనికి వెళ్లకుండా బాగా చూసుకుంటానని చెబుతున్నాడు. ఇక తన కొడుకు తదుపరి భవిష్యత్ అవసరాల కోసం అతని తండ్రి తమకున్న ఏకైక ఆస్తులైన ఒక ఆవు, ఐదు మేకపిల్లలను అమ్మడానికి సిద్ధం అయ్యాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa