ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో రోడ్డెక్కిన లక్షలమంది పౌరులు.. నో కింగ్స్ ర్యాలీలు

international |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 08:21 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల అరెస్టులకు ఆదేశించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, వలసదారుల హక్కులను కాపాడండి అనే నినాదాలతో అమెరికా వీధులు, పార్కులు, ప్లాజాలు హోరెత్తాయి. ఇక ట్రంప్ బర్త్ డే రోజే ఈ ఆందోళనలు జరగడం గమనార్హం. పలు నగరాల్లో భారీ ప్రదర్శనలు జరగ్గా.. పోర్ట్‌ల్యాండ్‌లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సాల్ట్‌లేక్ సిటీలో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. డౌన్‌టౌన్‌లు, చిన్న పట్టణాలు నిరసన ప్రదర్శనలతో కిక్కిరిసిపోయాయి. వందలాది నిరసన కార్యక్రమాల్లో లక్షల మంది అమెరికన్లు పాల్గొని ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


గత వారం లాస్ ఏంజెలెస్‌లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు వలసదారులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత ఈ ఆందోళనలు క్రమంగా దేశమంతటా విస్తరించాయి. ఆందోళనల నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని పలు రాష్ట్రాల గవర్నర్లు పిలుపునిచ్చారు. కొంత మంది గవర్నర్లు నేషనల్ గార్డ్‌లు పరేడ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పోర్ట్‌ల్యాండ్‌లో ఆందోళనకారులను ఖాళీ చేయించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.


 ఇక ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం ఎదుట ఆందోళన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాల్ట్‌లేక్ సిటీలోని డౌన్‌టౌన్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శన సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని 39 ఏళ్ల ఆర్థర్ ఫొలాసా అహ్ లూగా పోలీసులు గుర్తించారు. 24 ఏళ్ల అర్టురో గంబోవా కాల్పులు జరపడం వల్లే అహ్ లూ మృతిచెందారని నిర్ధారించారు. అహ్ లూ అమాయకుడని, ఆయన శాంతియుతంగా నిరసనలో పాల్గొన్నారని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


శనివారం రోజున జనమంతా ఒక్కటై అమెరికా కోసం శాంతియుతంగా నిలిచారని.. తమకు రాజులు అవసరం లేదని.. నో కింగ్స్ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. న్యూయార్క్, డెన్వర్, షికాగో, ఆస్టిన్, లాస్ ఏంజెలెస్‌లలో నో కింగ్స్ అని రాసి ఉన్న బ్యానర్లతో వేలాది మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అట్లాంటాలో 5 వేల మందికి సరిపడే వేదిక నిండిపోవడంతో.. వేలాది మంది బయటే ఉండిపోయారు. సియాటిల్‌లో జరిగిన ఆందోళనల్లో ఏకంగా 70 వేల మంది పాల్గొన్నారు.


వాషింగ్టన్‌లోని లోగాన్ సర్కిల్‌లో 200 మంది ఆందోళనకారులు ట్రంప్ రాజీనామా చేయాలి అనే నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ట్రంప్ బొమ్మను ప్రదర్శించారు. అందులో ట్రంప్ కిరీటం ధరించి బంగారు కమోడ్‌పై కూర్చున్న చిత్రాన్ని ప్రదర్శనలో చూపించారు. వర్జీనియాలోని కల్‌పెప్పర్‌లో జరిగిన ర్యాలీపైకి ఒక యువకుడు వాహనంతో దూసుకొచ్చాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెలెస్‌లోని సిటీ హాల్ వద్ద, మిన్నెసోటా, నార్త్ కరోలినా, టెక్సాస్, మిసిసిపి ప్రాంతాల్లో కూడా ఈ నో కింగ్స్ ఆందోళనలు జరిగాయి.


దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాషింగ్టన్‌లోని సైనిక పరేడ్‌కు హాజరయ్యారు. శనివారం డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు కావడం, అదే రోజున అమెరికా సైనిక దళాల 250వ వార్షికోత్సవం కావడం విశేషం. ఒకవైపు నిరసనకారులు, మరోవైపు సైనికుల కవాతుతో వాషింగ్టన్ నగరం హోరెత్తింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ సైనిక వందనాన్ని స్వీకరించారు. అయితే ప్రభుత్వ ధనంతో సైనిక పరేడ్ నిర్వహించడం సరికాదని ప్రతి 10 మంది అమెరికన్లలో ఆరుగురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ డబ్బుతో సీనియర్లకు ఆహారం అందించవచ్చని కొంత మంది సూచించారు. ఈ పరిణామాలు ట్రంప్ వలస విధానాలపై దేశవ్యాప్తంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa