భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా గతవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో కొత్త ఆధారాలు బయటికి వచ్చాయి. ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం కూలిపోవడానికి గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. విమానంలోని ర్యాట్ (ర్యామ్ ఎయిర్ టర్బైన్)ను మోహరించినట్లు క్లియరర్ ఆడియో, వీడియోల ద్వారా అర్థం అవుతోంది. సాధారణంగా విమానంలోని రెండు ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయినపుడు.. లేదా విమానంలోని ఎలక్ట్రికల్ వ్యవస్థ, హైడ్రాలిక్ వ్యవస్థలు పనిచేయకపోయినపుడు.. ఈ ర్యాట్ దానంతట అదే ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానానికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
జూన్ 12వ తేదీన జరిగిన ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో, ఆడియో ఫుటేజ్‌లలో ర్యామ్ ఎయిర్ టర్బైన్ మోహరించినట్లు కనిపిస్తోంది. ఈ ర్యాట్ అనేది ఒక చిన్న ప్రొపెల్లర్ లాంటి పరికరం. ఇది రెండు ఇంజిన్‌లు విఫలమైనప్పుడు లేదా మొత్తం ఎలక్ట్రానిక్ లేదా హైడ్రాలిక్ వైఫల్యం సంభవించినప్పుడు ఆటోమేటిక్‌గా బయటికి వస్తుంది. విమానం జెట్ ఇంజిన్‌ల శబ్దం లేకపోవడంతో.. ర్యాట్‌కు స్పందించిన ప్రత్యేకమైన హై పిచ్ సౌండ్ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఆ వీడియోలో విమానాన్ని టేకాఫ్ చేసేందుకు ప్రయత్నించగా.. అది విఫలమై వేగంగా కిందకి దిగడం కూడా కనిపిస్తుంది.
గాలి వేగాన్ని ఉపయోగించి ఈ ర్యామ్ ఎయిర్ టర్బైన్ అత్యవసర శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 3 సమయాల్లో ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. విమానం రెండు ఇంజిన్‌లు ఫెయిల్ అయినపుడు.. విమానంలో ఎలక్ట్రానిక్ వైఫల్యం సంభవించినపుడు.. విమానం హైడ్రాలిక్స్ ఫెయిల్ అయినపుడు ఈ ర్యాట్ ఓపెన్ అవుతుంది. అయితే ఆ వీడియో బయటికి వచ్చిన రోజే.. ఆ విమానంలో రెండు ఇంజిన్లు పాడయ్యాయని అనుమానం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సీనియర్ పైలట్, విమానయాన నిపుణుడు కెప్టెన్ ఎహ్సాన్ ఖలీద్ వెల్లడించారు. విమానం అకస్మాత్తుగా తిరగడం జరగలేదని, పక్షులు ఒకేసారి రెండు ఇంజిన్‌లను ఢీకొట్టడం దాదాపు అసాధ్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రమాదానికి కారణం విమానంలోని డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం అని దాదాపు అందరు అంచనా వేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి కూడా ప్రమాద సమయంలో ఒక శబ్దం వినిపించిందని.. అది ర్యాట్ మోహరింపు అయి ఉండవచ్చని పేర్కొన్నారు. ఒక ఇంజిన్ వేగంగా తిరగడం.. ప్రొపెల్లర్ తిరగడం, వేగం పుంజుకోవడం అయి ఉండవచ్చని తెలిపారు. రెడ్, బ్లూ కలర్ లైట్లను ఆ వ్యక్తి చూశాడని.. అది అత్యవసర శక్తిని అందించేందుకు, ఎమర్జెన్సీ లైట్లు ఆన్ కావడం అయి ఉండవచ్చని కెప్టెన్ ఎహ్సాన్ ఖలీద్ వివరించారు.
కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ వైఫల్యం ఇంజిన్‌లు ఆగిపోవడానికి దారితీస్తుందని ఖలీద్ తెలిపారు. ఒకేసారి రెండు ఇంజిన్‌లు ఆగిపోయాయని.. వాటి మధ్య రెండు సెకన్ల తేడా ఉన్నా.. ఎడమ లేదా కుడి వైపునకు ఉండేదని పేర్కొన్నారు. ఇంజిన్లు ఆగిపోవడానికి సాఫ్ట్‌వేర్ పనిచేయకపోవడం వల్ల మాత్రమే జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. అది సెన్సార్ల నుంచి తప్పుడు సిగ్నల్ ద్వారా అమలు చేయబడిందని.. దానికి ఎలక్ట్రికల్ వైఫల్యం కారణం అయి ఉండవచ్చని చెప్పారు.
ఎయిర్‌స్పేస్ ప్రొఫెసర్ డా. ఆదిత్య పరాంజపే కూడా ఈ ఆధారాలు రెండు ఇంజిన్‌లు విమానానికి థ్రస్ట్‌ను అందించడంలో ఫెయిల్ అయ్యాయని సూచిస్తున్నాయని వెల్లడించారు. విమానాలు ఒక ఇంజిన్ ఫెయిల్ అయి.. ఒకే ఇంజిన్ పనిచేసినప్పుడు కూడా ప్రయాణించేలా తయారు చేయబడి ఉంటాయని.. దీన్ని వన్ ఇంజిన్ అవుట్ క్లైంబ్ అని పిలుస్తారని చెప్పారు. కానీ ఇక్కడ రెండు ఇంజిన్లు పనిచేయలేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో 10 మంది ఎయిరిండియా సిబ్బంది, ఇద్దరు పైలట్లు సహా విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో బ్రిటీష్ ఇండియన్ అయిన 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే ప్రాణాలతో బయటికి వచ్చారు. ఇక ఆ విమానం మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై కూలడంతో అక్కడ మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
విమానం కూలడానికి పక్షులు ఢీకొనడమే ప్రాథమిక కారణమని తొలుత అంతా అనుమానం వ్యక్తం చేశారు, అయితే రన్‌వేపై పక్షుల మృతదేహాలు ఏవీ లభించకపోవడం, అందుబాటులో ఉన్న 2 వీడియోల్లో ఇంజిన్‌ల చుట్టూ ఎటువంటి మంటలు, నిప్పు రవ్వలు, పొగ లేదా శిథిలాలు కనిపించకపోవడంతో పక్షులు ఢీకొనలేదని అర్థం అవుతోంది. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa