దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ (29) పెళ్లైన రెండు వారాల్లోనే భార్య సోనమ్ కుట్రకు బలైపోయిన సంగతి తెలిసిందే. హనీమూన్‌లోనే తన ప్రియుడు రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి రాజాను హత్యచేయించింది. పోలీసుల కథనం ప్రకారం.. హనీమూన్ కోసం మేఘాలయలోని సోహ్రా ప్రాంతానికి వెళ్లిన రాజా-సోనమ్ జంట మే 23న కనిపించకుండా పోయారు. ఆపై జూన్ 2న రాజా మృతదేహం ఒక లోయ వద్ద గుర్తించారు. మిస్సింగ్ వ్యవహారంగా మొదలై చివరకు రక్తపాతం, కుట్ర కేసుగా మారింది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న సోనమ్.. రాజాను అత్యంత కిరాతకంగా ప్రియుడి సాయంతో హత్య చేయించింది.
రాజా రఘువంశీపై విశాల్ సింగ్ చౌహాన్ అనే కిరాయి హంతకుడు వేటకొడవలితో మొదటి వేటు వేశాడు. ఆ దెబ్బకు రాజా ఆర్తనాదాలు చేశాడు. ఒంటి నుంచి రక్తం ధారలా కారుతూ, బాధతో అరుస్తోన్న రాజాను చూసిన సోనమ్ అక్కడి నుంచి పారిపోయిందని పోలీసుల చెబుతున్నారు. రాజా చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాతే ఆమె మళ్లీ ఘటనాస్థలికి తిరిగొచ్చింది. అనంతరం మృతదేహాన్ని అక్కడ నుంచి పడేయడానికి హంతకులకు సహాయం చేసింది.
సోనమ్ ప్రియుడిగా భావిస్తోన్న రాజ్ కుశ్వాహా ఆమె కుటుంబానికి చెందిన ఫర్నిచర్ షీట్ యూనిట్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య కొనసాగుతున్న సంబంధమే రాజా హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. రాజ్ కుశ్వాహా సహకారంతోనే హత్యకు కిరాయి హంతకులను నియమించారని విచారణలో తేలింది. హత్యకు పాల్పడిన విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలను ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, సోనమ్‌కు ఈ పెళ్లి ఇష్టం లేదని, ముందే తల్లిని కూడా హెచ్చరించిందని తెలిసింది.
సీన్ రీకన్‌స్ట్రక్షన్
రాజా హత్య కేసు విచారణ ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మేఘాలయలోని సోహ్రా ప్రాంతానికి నిందితులను తీసుకెళ్లి సంఘటన స్థలంలో సీన్ రిక్రియేట్ చేశారు. వేటకొడవలితోనే రాజాను హత్య చేసినట్టు భావించిన పోలీసులు, మరో మారణాయుధాన్ని కూడా లోయలోకి విసిరేసినట్టు గుర్తించారు. హత్య అనంతరం పరారీలో ఉన్న సోనమ్.. జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్ జిల్లా నంద్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. తాను ఈ హత్య చేయించినట్టు ఆమె పోలీసుల ఎదుగ అంగీకరించింది.
ఇక, సోనం సోదరుడు గోవింద్. సోదరితో తమ కుటుంబం పూర్తిగా సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, రాజా కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని, న్యాయపోరాటంలో తోడుంటామని కూడా ప్రకటించాడు. ఇండోర్‌కు చెందిన ట్రావెల్ వ్యాపారి అయిన రాజా రఘువంశీకి.. మే 10న సోనమ్‌తో వివాహం జరిగింది. ఈ జంటన మే 20 హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి.. మే 23 తర్వాత ఆచూకీలేకుండా పోయింది. పది రోజుల అనంతరం రాజా మృతదేహం ఓ లోయలో గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa