మానవ శరీరంలో కాలేయం అతి పెద్ద గ్రంథి. ఇది ఎన్నో ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తుంది. జీర్ణవ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఉదరం యొక్క కుడి వైపున, డయాఫ్రమ్ క్రింద ఉంటుంది. శరీరం నుంచి టాక్సిన్లను తొలగించడంలో సాయపడుతుంది. అంతేకాకుండా రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లను లివర్ ఉత్పత్తి చేస్తుంది. అందుకే లివర్ పనితీరుపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ రోజుల్లో జీవనశైలి, చెడు అలవాట్లు, కాలుష్యం కారణంగా లివర్ పనితీరు మందగించడమే కాకుండా అనేక సమస్యలు వస్తున్నాయి.
ఫ్యాటీ లివర్ ఇప్పుడు సర్వసాధారణ సమస్యగా మారింది. దానితో పాటు కాలేయంలో ద్రవం చేరడం కూడా ఇప్పుడు సమస్యగా మారింది. కాలేయంలో నీరు చేరడం అంటే.. లివర్ చుట్టూ ద్రవం చేరడం అయి ఉండవచ్చు. ఇది తరచుగా తీవ్రమైన కాలేయ వ్యాధుల ఒక లక్షణం. కాలేయంలో ద్రవం చేరినప్పుడు కనిపించే లక్షణాల్ని సకాలంలో గుర్తించాలి. లేదంటే లివర్ సిర్రోసిస్ అనే తీవ్రమైన వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. లివర్‌లో నీరు చేరితే కనిపించే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్ట ఉబ్బరం, విస్తరణ
కాలేయంలో ద్రవం చేరినప్పుడు కనిపించే సాధారణ లక్షణం ఇది. ఇది అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. పొట్ట సాధారణం కంటే పెద్దదిగా, బిగుతుగా అనిపిస్తుంది. మీరు నిలబడినప్పుడు పొట్ట కిందకు వేలాడినట్లు అనిపించవచ్చు. ఈ లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఉబ్బరం కారణంగా కడుపు నొప్పి, అసౌకర్యంగా అనిపించవచ్చు.
బరువు పెరగడం
పొట్టలో పేరుకుపోయిన ద్రవం కారణంగా శరీరం బరువు పెరుగుతుంది. ఇది కేవలం ద్రవం వల్ల బరువు పెరగడం మాత్రమే. కొవ్వు వల్ల బరువు పెరగడం కాదు. ఉన్నట్టుండి మీరు బరువు పెరిగి.. కడుపు ముందుకొచ్చినట్టు కనిపిస్తే అది కాలేయం నీరు చేరిపోయిందనడానికి సంకేతం కావచ్చు.
శ్వాస ఆడకపోవడం
కాలేయంలో ద్రవం పెరిగినప్పుడు, అది డయాఫ్రమ్‌పై ఒత్తిడి తెస్తుంది. డయాఫ్రమ్ అంటే పొట్ట, ఊపిరితిత్తుల మధ్య ఉండే కండరం. ఈ ఒత్తిడి వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారవచ్చు. ఎటువంటి కారణంగా లేకుండా నిద్రిస్తున్నప్పుడు శ్వాస ఆడకపోతే.. ఇది లివర్‌లో ద్రవం చేరిందనడానికి సంకేతం కావచ్చు. పదే పదే ఇలా జరుగుతుంటే వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కాళ్లలో వాపు
లివర్‌లో నీరు చేరినప్పుడు కాళ్ళు, పాదాలు చీలమండలలో వాపు (ఎడెమా) కనిపించవచ్చు. ఇది శరీర ద్రవాల సమతుల్యత దెబ్బతినడం వల్ల జరుగుతుంది. ఎటువంటి కారణం లేకుండా మీ పాదాల్లో వాపు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు.
పసుపు రంగులో చర్మం, కళ్ళు
కాలేయ వ్యాధి తీవ్రంగా ఉన్నట్లయితే.. చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారవచ్చు. ఈ పరిస్థితిని కామెర్లు అంటారు. ఇది అసిటిస్‌కు కారణమయ్యే కాలేయ సమస్యకు సూచన. మీకు పదే పదే ఇలా జరుగుతుంటే కాలేయ వ్యాధికి సంకేతం.
అలసట, బలహీనత
మీరు ఏ పనిచేయకపోయినా అలసిపోతుంటే జాగ్రత్తగా ఉండండి. కాలేయ వ్యాధుల వల్ల సాధారణంగా అలసట, బలహీనత ఉంటాయి. చిన్న చిన్న పనులకే అలసిపోవడం, కొంత దూరం నడిచినా బలహీనంగా అనిపించడం జరుగుతుంటే అప్రమత్తంగా ఉండాలి. లివర్‌లో ద్రవం చేరడం వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాలేయంలో ద్రవం చేరడం ఈ లక్షణాలను మరింత తీవ్రతరం చేయవచ్చు.
ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయి
* పొట్టలో అధిక ద్రవ ఒత్తిడి వల్ల నాభి బయటకు పొడుచుకు రావడానికి దారితీస్తుంది.
* తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ పొట్ట నిండినట్లు అనిపించవచ్చు.
* కాలేయంలో ద్రవం చేరడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడి, ఆకలి మందగించడం, వికారం లేదా అప్పుడప్పుడు వాంతులు సంభవించవచ్చు.
ఎప్పుడు వైద్యుణ్ని సంప్రదించాలి?
పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా.. ముఖ్యంగా పొట్టలో ఉబ్బరం లేదా వాపు గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. అసిటిస్ అనేది తీవ్రమైన అంతర్లీన కాలేయ వ్యాధికి సంకేతం కావచ్చు. సకాలంలో చికిత్స చేయకపోతే తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. వైద్యులు నిర్ధారణ కోసం శారీరక పరీక్ష, అల్ట్రాసౌండ్, CT స్కాన్ లేదా MRI వంటి ఇమేజింగ్ పరీక్షలు చేస్తారు. కాలేయ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మద్యానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం కాలేయ వ్యాధులు రాకుండా తీవ్రతను తగ్గించడంలో సాయపడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa