ఈ మధ్య కాలంలో గుండె పోటు మరణాలు పెరిగిపోతున్నాయి. డ్యాన్స్ చేస్తూ కొందరు కుప్ప కూలిపోతున్నారు. జిమ్ చేస్తూ మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ మాత్రం ముందస్తు సంకేతాలు ఇవ్వకుండా సడెన్ గా వచ్చి ప్రాణాలు తీసేస్తుంది హార్ట్ అటాక్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా తక్కువ వయసున్న వాళ్లకీ గుండెపోటు వస్తోంది. డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే.. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొంత మంది నిపుణులు గుండెపోటు రిస్క్ తగ్గించుకోడానికి అవసరమైన చిట్కాలు చెప్పారు. ముఖ్యంగా 5 రకాల అలవాట్లతో ఈ ఇబ్బంది తగ్గించుకోవచ్చని వివరించారు. ఆ టిప్స్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.
ఫిజికల్ యాక్టివిటీ
ఎంత బిజీగా ఉన్నా సరే కచ్చితంగా రోజూ చేయాల్సిన పని ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవడం. అంటే కనీసం ఓ అరగంట అయినా వ్యాయామానికి కేటాయించుకోవాలి. భారీ వర్కౌట్స్ చేయాల్సిన పని లేదు. ఆరోగ్యాన్నిచ్చే యోగాసనాలు వేయొచ్చు. లేదా కాసేపు అలా బయటకు వెళ్లి వాకింగ్ చేసినా సరిపోతుంది. జాగింగ్ చేసినా మంచి ఫలితాలుంటాయి. చాలా సింపుల్ వ్యాయామాలు చేసినా సరే హార్ట్ అటాక్ రిస్క్ చాలా వరకు తగ్గిపోతుందని చెబుతున్నారు కార్డియాలజిస్ట్ లు. సైక్లింగ్, డ్యాన్సింగ్ తో పాటు గార్డెనింగ్ లాంటివి చేసినా గుండె సేఫ్ గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల గుండెపోటు ముప్పు కనీసం 30 శాతం వరకూ తగ్గిపోయేందుకు అవకాశాలుంటాయి. వారానికి కనీసం 150 నిముషాల పాటు ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.
డైట్ విషయంలో జాగ్రత్త
గుండె సరైన విధంగా పని చేయాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ఫుడ్ తోనే సమస్యలన్నీ వస్తాయి. ఆ ఫుడ్ తోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రక్తసరఫరా మెరుగ్గా ఉండాలంటే రోజువారి డైట్ లో పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీంతో పాటు లీన్ ప్రొటీన్ ఉండే మాంసం, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే నూనె వాడాలి. అంటే ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది. పప్పు దినుసులు కూడా గుండెకి మేలు చేస్తాయి.
రెగ్యులర్ గా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే గుండెపోటు ముప్పు చాలా వరకూ తగ్గిపోతుంది. నట్స్ తీసుకుంటే గుండె ఇంకా పదిలంగా ఉంటుంది. కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే పదార్థాలు తీసుకుంటే మంచిది. షుగర్ కంటెంట్ తగ్గించాలి. కొలెస్ట్రాల్ ని పెంచే ఆహార పదార్థాలనూ పక్కన పెట్టాలి.
ప్రశాంతత ముఖ్యం
స్ట్రెస్ ఎక్కువయ్యే కొద్దీ గుండెపైన ఒత్తిడి పడుతుంది. పని తీరు మారిపోతుంది. తెలియకుండానే ఇదే హార్ట్ అటాక్ కి దారి తీస్తుంది. ఒత్తిడి పెరిగే కొద్దీ బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. దీని వల్ల ఛాతిలో మంట వచ్చే ప్రమాదముంటుంది. ఇదే గుండెపోటు రావడానికి కారణమవుతుంది. కొన్ని సార్లు ఒత్తిడి వల్ల అతిగా తినడం, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు కూడా అవుతాయి.
అందుకే వీలైనంత వరకూ స్ట్రెస్ తగ్గించుకోడానికి ప్రయత్నించాలి. రోజూ కనీసం 5 నిముషాల పాటు డీప్ బ్రీతింగ్ వ్యాయామం చేయాలి. అంటే ప్రాణాయామ లాంటివి. మెడిటేషన్ లేదా యోగా లాంటివి చేయడం మంచిది. నచ్చిన వాళ్లతో సమయం గడపాలి. పాటలు వినడం, సినిమాలు చూడడం లాంటివీ మంచిదే. మొత్తంగా ఏదో విధంగా నవ్వుకోడానికి ప్రయత్నించాలి. దీని వల్ల గుండె భద్రంగా ఉంటుంది.
కంటినిండా నిద్ర
కంటి నిండా నిద్ర పడితే ఎలాంటి ఇబ్బందులూ రావు. నిద్రలేమి ఉంటే మాత్రం దాంతో పాటు హార్ట్ అటాక్ ముప్పు కూడా పెరిగిపోతుంది. దీని వల్ల బాడీపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గుండెపై ఎక్కువ స్ట్రెస్ పడే ప్రమాదముంటుంది. బీపీ పెరగడం, హార్ట్ రేట్ లో మార్పులు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే..కచ్చితంగా రోజూ 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. కేవలం ఈ క్వాంటిటీపైనే కాకుండా కాస్త క్వాలిటీపైనా ఫోకస్ పెట్టాలి. అంటే..నిద్రపోయినంత సేపూ ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. గుండె సేఫ్ గా ఉండాలంటే నిద్ర తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
నంబర్స్ చూసుకోండి
హార్ట్ హెల్త్ కోసం పాటించాల్సిన మరో జాగ్రత్త ఏంటంటే..ముందుగానే బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ ని చెక్ చేసుకోవడం. అంటే..ఎప్పటికప్పుడు వీటి నంబర్స్ నోట్ చేసుకోవాలి. ఏ సమయంలో ఎంత ఉంటున్నాయన్న అవగాహన కచ్చితంగా ఉండాలి. బరువు కూడా అప్పుడప్పుడూ చెక్ చేసుకోవడం మంచిది. హై కొలెస్ట్రాల్, హైబీపీ వచ్చినప్పుడు చాలా సడెన్ గా సింప్టమ్స్ బయటపడతాయి. అందుకే..ముందుగానే వీటిని చెక్ చేసుకుంటూ అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరీ చేయిదాటితే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa