మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వానికి, సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వృకి వైఎస్ జగన్ కాన్వాయి కింద పడి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి గుంటూరు పోలీసులు.. వైఎస్ జగన్ మీద కూడా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్.. ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు రాజకీయాలను దిగజార్చారని.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా అంటూ జగన్ సవాల్ విసిరారు.
"చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కాని, మీ పవన్‌కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్ హక్కు కాదా? మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, మూడ్ రానప్పుడు మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా?" అంటూ వైఎస్ జగన్ చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు.
"జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఆ కార్యక్రమం గురించి తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్." అని జగన్ ట్వీట్ చేశారు.
"జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌మ్యాప్ ఇచ్చిన తర్వాత, పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడు, మరి మీ రోప్ పార్టీలకు, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని, ఎవ్వరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్‌పార్టీలను జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడతారు? ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా? " అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ సీఎంకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలన్న వైఎస్ జగన్.. గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని నడపాలనేది ప్రొటోకాల్ అని పేర్కొన్నారు. మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రభుత్వం ఇవ్వకపోతే., గవర్నమెంటు అనుమతితో తానే తన సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనుగోలు చేసినట్లు వైఎస్ జగన్ తెలిపారు. ప్రభుత్వమే ప్రోటోకాల్ ప్రకారం డ్రైవర్‌ను కేటాయించిందని.. గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న వాహనం, గవర్నమెంట్ ఇచ్చిన పైలట్ వెహికల్స్, ప్రభుత్వం రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్న సమయంలో .. మాజీ సీఎం ప్రయాణిస్తున్న వాహనం సెక్యూరిటీ ప్రభుత్వానిది కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఘటన జరిగిన రోజు ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పిందేమిటన్న వైఎస్ జగన్.. ఎందుకు ఈ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రభుత్వం వైఫల్యాలు, హామీల అమలులో లోపాలు. అవినీతి గురించి మాట్లాడుతుంటే.. వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, తన మీద ప్రేమను చూసి తట్టుకోలేక, దిగజారి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
పల్నాడు జిల్లా పర్యటనలో తాను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లకు వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు ఈ ఘటన గురించి వైసీపీ పార్టీ నేతలు తనతో చెప్పినట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారని తెలిపారు. కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని తాను ఆదేశించినట్లు వైఎస్ జగన్ ట్వీట్లో రాసుకొచ్చారు.
ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర తమ బాధ్యతను నిర్వర్తించామని.. ఇదే పర్యటనలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించామన్నారు. అయినా కూడా తమ మీద విషప్రచారాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనల సమయంలో, సమావేశాల్లో చనిపోయిన వారి విషయంలో ఏం చేశారని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa