ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రార్థనల వేళ ఆత్మాహుతి దాడి,,చర్చిలో మారణహోమం.. , 22 మంది మృతి!

international |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 10:23 PM

సిరియా రాజధాని డమాస్కస్‌లో ఆదివారం నాడు ఒక చర్చిలో జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర భీభత్సాన్ని సృష్టించింది. డ్వెయిలా శివారులోని మార్ ఎలియాస్ చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా సంభవించిన ఈ పేలుడులో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి ISIL (ISIS) ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక వ్యక్తి పాల్పడ్డాడని సిరియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మైనారిటీల మద్దతును పొందేందుకు ప్రయత్నిస్తున్న కీలక సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం.


సుదీర్ఘ యుద్ధం తర్వాత సిరియా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఇలాంటి దాడి జరగడం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సుమారు 14 సంవత్సరాల పాటు సాగిన అంతర్యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. కోట్లాది మంది నిరాశ్రయులు అయ్యారు. 2024 డిసెంబర్‌లో బషర్ అల్-అస్సాద్ అధ్యక్ష పదవి నుంచి తొలగించబడిన తర్వాత సిరియాకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలను ఎత్తివేయడంతో దేశంలో శాంతి, ఆర్థిక స్థిరత్వం తిరిగి వస్తాయని ఆశించిన తరుణంలో ఈ ఉగ్రదాడి ఒక పెద్ద ఎదురుదెబ్బగా మరింది.


ముఖ్యంగా సిరియా సివిల్ డిఫెన్స్ విడుదల చేసిన ఫోటోలలో చర్చి లోపల నెలకొన్న విధ్వంసం హృదయ విదారకంగా ఉంది. కుర్చీలు విరిగిపోయి నేల, గోడలన్నీ రక్తంతో నిండిపోయి ఉండగా.. దాడి తీవ్రతను కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయితే మీడియాతో మాట్లాడిన రావాడ్ అనే ప్రత్యక్ష సాక్షి.. చర్చి సమీపంలో ఉండగా ఒక వ్యక్తి చర్చిపై కాల్పులు జరపడం చూశానని, ఆ తర్వాత చర్చిలోకి ప్రవేశించి తనను తాను పేల్చుకున్నాడని వివరించాడు.


ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న భద్రతా సిబ్బంది, సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రాణాలతో బయటపడిన వారు భయంతో, ఆవేదనతో ఏడుస్తూ కనిపించారు. సిరియా సమాచార మంత్రి హంజా అల్-మోస్తఫా ఈ దాడిని "పిరికిపంద చర్య" అని ఖండించారు. "ఈ చర్య మనల్ని కలిపే పౌర విలువలకు విరుద్ధం" అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నేర సంస్థలను ఎదుర్కోవడానికి, సమాజానికి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.


ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి గెయిర్ పెడర్సన్ కూడా ఈ "హేయమైన నేరాన్ని" తీవ్రంగా ఖండించారు. సిరియా అధికారులు ఈ దాడికి ISIL బాధ్యత వహించిందని చెప్పారని, దీనిపై పూర్తి విచారణ జరపాలని ఆయన కోరారు. టర్కీతో సహా పలు అంతర్జాతీయ దేశాలు ఈ దాడిని "ద్రోహపూరితమైనది" అని అభివర్ణించాయి. సిరియాలో స్థిరత్వం, భద్రతను సాధించే ప్రయత్నాలను అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నంగా ఈ దాడిని పరిగణించారు. ఈ ఘటన సిరియా ప్రజల్లో భయాందోళనలను మరింత పెంచింది. ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa