కర్ణాటకకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే వివాదంలో చిక్కుకున్నారు. రోడ్డుపై జరిగిన ఓ ఘర్షణలో ముస్లిం కుటుంబంపై దాడి చేసి, కులం పేరుతో దూషించి, చంపుతామని బెదిరించిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హలేనహళ్లికి చెందిన సైఫ్‌ఖాన్ నిన్న తన కుటుంబంతో కలిసి తుమకూరులో ఓ వివాహ వేడుకకు హాజరై ఇన్నోవా క్రిస్టా కారులో తిరిగి వస్తున్నారు. సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో నిజగల్ సమీపంలో తెలుపు రంగు ఎక్స్‌యూవీ700 కారు ఒకటి వారి వాహనాన్ని అడ్డగించింది. ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారిలో ఒకరు ‘నేను డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాను’ అని అరుస్తూ తమ కారును రోడ్డు పక్కకు ఆపమని బలవంతం చేశారని సైఫ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.అనంతరం, ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి, తనను తాను గన్‌మ్యాన్‌గా చెప్పుకుంటూ సైఫ్‌పై చేయి చేసుకున్నాడు. మరో వ్యక్తి సైఫ్ సోదరుడు సల్మాన్ ఖాన్‌ను కారులోంచి బయటకు లాగి దాడి చేయడంతో అతని మూడు పళ్లు విరిగిపోయాయి. మూడో వ్యక్తి అనంతకుమార్ హెగ్డే అని సైఫ్ గుర్తించారు. ‘వాళ్లు సాబ్రు గ్రూప్ వాళ్లు, కొట్టండి!’ అంటూ హెగ్డేనే దాడికి పురిగొల్పారని సైఫ్ ఆరోపించారు. ‘సాబ్రు’ అనే పదాన్ని కర్ణాటకలో ముస్లింలను కించపరిచేందుకు వాడే గ్రామ్య పదంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి సమయంలో ‘తక్కువ సాబ్రు కులం’ వంటి కులపరమైన దూషణలు, అసభ్య పదజాలం ఉపయోగించినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.తమపై దాడిని ప్రశ్నించిన తన తల్లి గుల్ ఉన్నీసా మెడ పట్టుకుని, బట్టలు లాగి, తలపై కొట్టి కిందపడేశారని హెగ్డేపై సైఫ్ ఆరోపణలు చేశారు. సైఫ్ మామ ఇలియాస్ ఖాన్‌పైనా హెగ్డే దాడి చేశారని, ఈ దాడిలో ఆయన పళ్లు విరిగి రక్తస్రావమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గన్‌మ్యాన్ తుపాకీ చూపిస్తూ తమ కుటుంబాన్ని కాల్చి చంపుతామని బెదిరించినట్టు కూడా తెలిపారు.తీవ్ర గాయాలపాలైన బాధితులను దాబస్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సమక్షంలో సైఫ్ ఖాన్ నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్న అనంతరం, పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దాబస్‌పేట్ పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa