రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వ విజయాలను జులై 2వ తేదీ నుంచి ప్రతి ఇంటికీ చేరవేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని, వారి సేవలను తప్పనిసరిగా గుర్తిస్తామని ఈ సందర్భంగా లోకేశ్ హామీ ఇచ్చారు.ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు, తాను ప్రతిరోజూ ఐదుగురు ప్రజలు, ఐదుగురు కార్యకర్తలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని లోకేశ్ వెల్లడించారు. "కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. పార్టీ సంస్థాగత విషయాలు, సమస్యలపై చంద్రబాబుతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాను. పది నిర్ణయాల్లో ఒక తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు వివిధ స్థాయిల్లోని నాయకుల ద్వారా మా దృష్టికి తీసుకువస్తే వాటిని సరిదిద్దుకుంటాం" అని ఆయన అన్నారు. గత ఎన్నికలకు ముందు నిర్వహించిన బాబు సూపర్–6, బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ వంటి కార్యక్రమాలతో పాటు ఎన్నికల అనంతరం చేపట్టిన మన టీడీపీ, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారని ప్రశంసించారు. పార్టీ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి పనిచేసిన వారిని గుర్తించాలన్నదే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా కేడర్‌ను మరువకుండా చంద్రబాబు, తాను ప్రతి జిల్లాకు వెళ్లినప్పుడల్లా కార్యకర్తలను కలుస్తున్నామని గుర్తుచేశారు.జులై 2వ తేదీ నుంచి ప్రతిఒక్కరూ గడపగడపకు వెళ్లి, గత ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు. "బాబు సూపర్–6 కార్యక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద ఒకే జీఓతో రూ.8,745 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిర్దేశిత సమయానికే తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలుచేశాం" అని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని, పెద్దఎత్తున పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు శాయశక్తులా కృషిచేస్తున్నామని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందిస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయబోతున్నామని లోకేశ్ ప్రకటించారు.ప్రజలు అహంకారాన్ని, ఇగోలను ఏమాత్రం హర్షించరని లోకేశ్ పార్టీ శ్రేణులకు హితవు పలికారు. "గత పాలకులు అహంకారంతో వ్యవహరించడం వల్లే వారి సంఖ్య 151 నుంచి 11కి పడిపోయింది. ఏ నాయకుడైనా తప్పుగా ప్రవర్తిస్తే ఆ ప్రభావం పార్టీపై పడుతుంది. ప్రజల్లోకి వెళ్లి ఓర్పు, సహనంతో వారు చెప్పే సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి కృషిచేయండి" అని సూచించారు. గత ప్రభుత్వం కక్షసాధింపు చర్యగా నిలిపివేసిన ఉపాధి హామీ, నీరు–చెట్టు పథకాల బిల్లులను 90 శాతం వరకు క్లియర్ చేశామని, మిగిలిన బిల్లులను కూడా జులైలోగా అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల వంటి సమస్యలుంటే మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవచ్చని భరోసా ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి దివాలా తీయించిందని లోకేశ్ విమర్శించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విధాలా సహకరిస్తూ రాష్ట్రానికి ఆక్సిజన్ అందిస్తున్నారని అన్నారు. అమరావతి, విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్ వంటి అన్ని కీలక అంశాలపై ప్రధాని సానుకూలంగా ఉన్నారని తెలిపారు. "రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఏర్పడింది. ఈ కూటమిలో మనది పెద్దన్న పాత్ర. ఏవైనా సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలి" అని దిశానిర్దేశం చేశారు. టీడీపీ చొరవ వల్లే వక్ఫ్ బిల్లులో నాలుగు కీలక సవరణలు చేశారని, ఇది పార్టీకి ఉన్న కమిట్‌మెంట్‌కు నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీలో ఏ ఒక్క నాయకుడు కూడా గతంలో తాము పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న అవమానాలను మరువకూడదని హితవు పలికారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో తాను ఆయనను కలిసేందుకు తీవ్రస్థాయిలో పోరాడాల్సి వచ్చిందని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాశ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa