అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో కీలక విజయాన్ని అందుకుంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విజయవంతంగా అడుగుపెట్టారు. వారి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమయ్యే ప్రక్రియ గురువారం సాయంత్రం విజయవంతంగా పూర్తయింది. ఈ ఘనతతో అంతరిక్ష యాత్రల్లో భారత్ తనదైన ముద్రను మరోసారి చాటింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ -విస్నీవ్‌స్కీ, హంగరీకి చెందిన టిబర్ కపులు అంతరిక్షయానం చేపట్టారు. భారత కాలమానం ప్రకారం బుధవారం జూన్ 25 మధ్యాహ్నం 12:01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా వీరి స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది.దాదాపు ఒక రోజు ప్రయాణం అనంతరం, గురువారం జూన్ 26 సాయంత్రం ఈ వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:03 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్‌ను ఐఎస్‌ఎస్‌తో అనుసంధానించే డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అనంతరం వ్యోమగాములు నలుగురూ ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. ఈ మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా సహా వ్యోమగాముల బృందం 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనుంది. ఈ సమయంలో వారు పలు పరిశోధనలు, ప్రయోగాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలకు మరింత ఊతమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa