భార్య ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నంత మాత్రాన, అత్తవారింట్లో అలవాటైన జీవన ప్రమాణాలకు అనుగుణంగా భర్త నుంచి ఆర్థిక సహాయం పొందే హక్కును ఆమె కోల్పోదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భార్యకు నెలకు రూ.15,000 భరణంగా చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ మంజుషా దేశ్‌పాండే నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే థానేకు చెందిన 36 ఏళ్ల వ్యక్తికి 2012 నవంబర్ 28న వివాహమైంది. అయితే, వారి మధ్య మనస్పర్థలు పొడసూపడంతో 2015 మే నుంచి భార్య తన పుట్టింట్లోనే ఉంటోంది. భార్య కోరిక మేరకు ఆమె సౌకర్యంగా జీవించేందుకు కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని, తాను నెరవేర్చలేని షరతులు పెట్టిందని భర్త తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ క్రమంలో, విడాకులు కోరుతూ ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.మరోవైపు, తన పోషణకు భరణం ఇప్పించాలని కోరుతూ భార్య 2021 సెప్టెంబర్ 29న కోర్టులో మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు 2023 ఆగస్టు 24న ఆమెకు నెలకు రూ.15,000 భరణం చెల్లించాలని భర్తను ఆదేశించింది.ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. భర్త తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమె ఓ పాఠశాలలో పనిచేస్తూ నెలకు రూ.21,820 జీతం తీసుకుంటోందని, ట్యూషన్ల ద్వారా ఏటా రూ.2 లక్షలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ కూడా సంపాదిస్తోందని, కాబట్టి ఆమెకు భరణం అవసరం లేదని తెలిపారు.ఈ వాదనలను భార్య తరఫు న్యాయవాది ఖండించారు. భర్త ఓ ప్రతిష్ఠాత్మక కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తూ లక్షల్లో జీతం అందుకుంటున్నాడని, ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇంత స్థోమత ఉన్నప్పటికీ, చట్టప్రకారం భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని ఎగ్గొట్టేందుకే ప్రయత్నిస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. భార్య సంపాదిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఆ ఆదాయం ఆమె గౌరవంగా జీవించేందుకు సరిపోదని, ఉద్యోగం కోసం రోజూ చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొంది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి తన సోదరుడి ఇంట్లో ఉంటోందని, ఈ పరిస్థితి ఎల్లకాలం కొనసాగదని, ఆమెకున్న కొద్దిపాటి సంపాదనతో మంచి జీవితం గడపడం సాధ్యం కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.అదే సమయంలో, భర్త ఆదాయం చాలా ఎక్కువగా ఉందని, అతనికి పెద్దగా ఆర్థిక బాధ్యతలు కూడా లేవని ధర్మాసనం పేర్కొంది. భర్త తన సొంత ఖర్చులకు, ఇతర బాధ్యతలకు కొంత మొత్తం తీసివేసినప్పటికీ, ఫ్యామిలీ కోర్టు ఆదేశించిన ప్రకారం భార్యకు భరణం చెల్లించగల సామర్థ్యం అతనికి ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ భర్త వేసిన అప్పీలును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa