ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోసబళె వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఘాటు విమర్శలు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 05:03 PM

భారత రాజ్యాంగంలోని 'లౌకిక వాద' సెక్యులర్, 'సామ్యవాద' సోషలిస్ట్ పదాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తోందని, దాని రూపకర్తలపై దాడి చేస్తోందని ఆయన ఘాటుగా విమర్శించారు.ఎక్స్ వేదికగా జైరాం రమేశ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. "ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. 1949 నవంబర్ 30 నుంచే డాక్టర్ అంబేడ్కర్, నెహ్రూ వంటి రాజ్యాంగ నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది" అని ఆయన ఆరోపించారు. మనుస్మృతి స్ఫూర్తితో రాజ్యాంగం లేదన్నదే ఆర్ఎస్ఎస్ అసంతృప్తికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు పదేపదే కొత్త రాజ్యాంగం కావాలని పిలుపునిచ్చాయని, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ ప్రచారంలో ఇదే నినాదాన్ని వినిపించారని, అయితే దేశ ప్రజలు ఆ పిలుపును గట్టిగా తిరస్కరించారని రమేశ్ గుర్తుచేశారు.అయినప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాలనే డిమాండ్లు ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఇంకా వస్తూనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జైరాం రమేశ్ ప్రస్తావించారు. రాజ్యాంగ పీఠికలో 'లౌకిక', 'సోషలిస్ట్' పదాలను చేర్చిన 42వ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. "ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకుడు ఇప్పుడు లేవనెత్తుతున్న అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తే 2024 నవంబర్ 25న ఒక తీర్పు ఇచ్చారు. దయచేసి ఆ తీర్పును చదవమని ఆయనను కోరుతున్నాం" అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు.పార్లమెంటుకు రాజ్యాంగాన్ని, దాని పీఠికను సవరించే అధికారం ఉందని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందని జైరాం రమేశ్ తెలిపారు. కేశవానంద భారతి, ఎస్ఆర్ బొమ్మై వంటి చారిత్రక కేసుల్లో లౌకికవాదం అనేది రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణమని న్యాయస్థానం పలుమార్లు పునరుద్ఘాటించిందని ఆయన పేర్కొన్నారు.నాటి ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో దత్తాత్రేయ హోసబళె మాట్లాడారు. రాజ్యాంగంలో 'సోషలిస్ట్', 'సెక్యులర్' అనే పదాలను బలవంతంగా చేర్చారని, వాటిపై ఇప్పుడు పునఃసమీక్ష జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన వారు ఇంతవరకు క్షమాపణ చెప్పలేదని కూడా ఆయన విమర్శించారు. హోసబళె వ్యాఖ్యలతో రాజ్యాంగ మౌలిక సూత్రాలపై ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ మధ్య మరోసారి సైద్ధాంతిక పోరు మొదలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa