టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దీపావళి నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. మంత్రి పొంగూరు నారాయణ .. శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మాట్లాడిన మంత్రి నారాయణ.. లబ్ధిదారులకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందన్నారు.
ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి టీడీపీ కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని.. మున్సిపాలిటీలు, పట్టణాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నారాయణ వివిరించారు.
మరోవైపు 2014లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం పేదల కోసం టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి సుమారుగా 7 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 5 లక్షల ఇళ్లకు అప్పటి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. వాటిలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి.. 3.13 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటంతో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి బ్రేకులు పడ్డాయని కూటమి ప్రభుత్వం చెప్తోంది. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి టిడ్కో ఇళ్ల మీద ఫోకస్ పెట్టారు.
టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్లను 2025 జూన్ 12 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.1.18 లక్షల ఇళ్లను జూన్ 12 నాటికి పూర్తి చేయాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. అయితే వివిధ కారణాలతో టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగంగా జరగడం లేదు. దసరాకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని ఇటీవల చెప్పిన మంత్రి నారాయణ.. దీపావళి నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని తాజాగా వెల్లడించారు.
మరోవైపు టిడ్కో ఇళ్ల కోసం ఏపీ ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అనర్హుల స్థానంలో కొత్త వారికి టిడ్కో ఇళ్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే వయోవృద్ధులు, సిబిల్ స్కోరు తక్కువగా ఉండేవారికి బ్యాంకు రుణం మంజూరు చేయించే అవకాశాలను మున్సిపల్ కమిషనర్లు పరిశీలించాలని సూచించింది. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఒకే విడతలో రుణం మొత్తం చెల్లిస్తారా అనేది పరిశీలించాలని.. లేకపోతే లబ్ధిదారు ఇంటిలో అర్హత ఉన్న వారితో జాయింట్ ఓనర్‌షిప్‌తో టిడ్కో ఇళ్లు కేటాయించాలని సూచించింది. టిడ్కో ఇల్లు కేటాయించిన లబ్ధిదారు చనిపోయి ఉంటే.. ఆ కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఇల్లు కేటాయించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa