ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో ఏఐ ఫర్ ఏపీ పోలీస్-హ్యాకథాన్-2025 హాజరైన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 08:26 PM

టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు పిలుపినిచ్చారు. టెక్నాలజీతో దర్యాప్తు ఎలా చేయాలో వివేకా హత్య కేసే ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించిన ఏఐ ఫర్ ఏపీ పోలీస్-హ్యాకథాన్-2025 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నేరాల కట్టడికి, వేగవంతమైన దర్యాప్తునకు పోలీస్ విభాగం టెక్నాలజీని వినియోగించుకునే అంశంపై ఈ హ్యాకథాన్ ఏర్పాటు చేసింది. ఏపీ పోలీస్ విభాగం, అమెరికాకు చెందిన 4 సైట్ ఏఐ సంస్థలు ఈ హ్యాకథాన్ నిర్వహించాయి. ఈ హ్యాకథాన్ లో 160కు పైగా టీములు పాల్గొన్నాయి. ఈ టీములతో సీఎం చంద్రబాబు కొద్ది సేపు ముచ్చటించారు. పోలీస్ విభాగంలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఎలాంటి సేవలు అందించవచ్చు పనితీరును ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చనే అంశంపై వారితో ముఖ్యమంత్రి చర్చించారు.హ్యకథాన్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. “రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు కూడా శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని స్పష్టం చేశారు. దీనికి పోలీస్ శాఖ సమర్ధవంతంగా పని చేయాలి. గతంలో మాదిరి కాకుండా పోలీసుల పనితీరు మారాలి. సహజంగా పోలీసులు పాత పద్దతులను అవలంభిస్తారు. కానీ ఏపీ పోలీసులు టెక్నాలజీ అవసరాన్ని గుర్తించి ఈ రకమైన హ్యాకథాన్ ఏర్పాటు చేయడం సంతోషం. పోలీసులు తమ దర్యాప్తులో టెక్నాలజీని విరివిగా వినియోగించాలి. వివేకా హత్య కేసులో నాపై ఆరోపణలు చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ విమర్శించారు. కానీ సీబీఐ తన దర్యాప్తులో గూగుల్ టేకవుట్ వంటి సాంకేతిక విధానాలను వినియోగించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ వాళ్లూ మారలేదు. మాజీ సీఎం అయ్యిండి తెనాలిలో రౌడీ షీటర్లకు సంఘీభావం తెలిపారు. ఇటీవల పల్నాడు జిల్లాలో పర్యటనలో ఏం జరిగిందో అందరూ చూశారు. తప్పులు చేసి బుకాయిస్తున్నారు. ఇలాంటి బుకాయింపులను తిప్పికొట్టాలంటే టెక్నాలజీని ఉపయోగించక తప్పదు” అని సీఎం స్పష్టం చేశారు.ప్రభుత్వంలో టెక్నాలజీని వినియోగిస్తున్నామని పోలీస్ విభాగం కూడా సాంకేతిక అందిపుచ్చుకుంటోందని దానికి ఈ హ్యాకథాన్ నిర్వహణే నిదర్శనమన్నారు. “వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. టెక్నాలజీ ద్వారా సేవలు అందించడమే కాదు పాలనలో జవాబుదారీతనం పెరుగుతుంది. డ్రోన్లను సీసీ టీవీ కెమెరాలు అన్ని చోట్లా పెడుతున్నాం. రౌడీలు గొడవ చేస్తే ఆధారాలతో వారి చొక్కా పట్టుకునే పరిస్థితి తెస్తాం. ఇష్టానుసారంగా గంజాయి అమ్ముతాం, సేవిస్తాం, పండిస్తాం అంటే కుదరదు తాటతీస్తాం. ఆడబిడ్డలను గొడవ చేస్తాం అత్యాచారాలను చేస్తాం అంటే కుదరదు. ఏఐ లేనప్పుడే కంట్రోల్ చేశాం ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఆధారాలు చాలా సులువుగా లభిస్తాయి. తప్పు చేస్తే ప్రభుత్వం ఏం చేయాలో అది చేసి చూపిస్తాం. యువత టెక్నాలజీతో లబ్ధి పొందాలి. గతంలో ఐటీని ప్రమోట్ చేశాం. ఇప్పుడు క్వాంటం వ్యాలీ ద్వారా తెలుగు సత్తాను చాటబోతున్నాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఇక్కడ క్వాంటం వ్యాలీ. వర్క్ లోకల్లీ థింక్ గ్లోబల్లీ. యాక్ట్ గ్లోబల్లీ అనే విధంగా ప్రస్తుతం ప్రపంచం రూపాంతరం చెందుతోంది” అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోం మంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa