ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లివర్ ఫెయిల్ అయ్యే ముందు శరీరంలో కనిపించే లక్షణాలు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 10:42 PM

కాలేయం శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది పొట్ట యొక్క కుడివైపున, డయాఫ్రమ్ కింద ఉంటుంది. ఇది సుమారు 1.4 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఇది శరీరంలో ఎన్నో విధులు నిర్వహిస్తుంది. కాలేయం పిత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాలేయం రక్తం నుంచి టాక్సిన్లను, మందులను, ఆల్కహాల్‌ను వడపోసి తొలగిస్తుంది. రక్తం గట్టకట్టడానికి అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది కాలేయం. ఇక, అలాంటి లివర్‌ని కాపాడుకోవాలి.అయితే, ఈ రోజుల్లో జీవనశైలి, చెడు అలవాట్లు కారణంగా లివర్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి.


​కాలేయం దెబ్బతిన్నప్పుడు లేదా సరిగ్గా పనిచేయనప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఫ్యాటీ లివర్, లివర్ ఎర్రోసిస్, లివర్ క్యాన్సర్, హెపటైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇక, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనేది తీవ్రమైన ప్రాణాంతకమైన పరిస్థితి. ఈ వ్యాధిలో కాలేయం అకస్మాత్తుగా, సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాలలో, సరిగ్గా పనిచేయడం ఆగిపోతుంది. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అయితే శరీరంలో కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. ఆ లక్షణాలేంటో తెలుసుకుంటే ప్రాణాంతక పరిస్థితిని నివారించవచ్చు. ఆ లక్షణాలపై ఓ లుక్కేద్దాం.


అలసట, బలహీనత


మీరు చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా, మెట్లు ఎక్కినా, కాస్త దూరం నడిచినా వీక్‌గా అనిపిస్తుందా? అయితే, ఈ లక్షణాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. లివర్ ఫెయిల్ అయ్యే ముందు ఈ లక్షణం తరచుగా కనిపిస్తుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అసాధారణంగా అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించడం కూడా దీనికి సంకేతమే.


చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం


లివర్ ఫెయిల్ అయ్యే ముందు సాధారణంగా కనపించే లక్షణం ఇది. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నప్పుడు కాలేయం సరిగ్గా పనిచేయదు. దీంతో బిలిరుబిన్ పేరుకుపోతుంది. బిలిరుబిన్ పేరుకుపోవడం వల్ల చర్మం, కళ్ళ తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం. కాలేయం సాధారణంగా ఈ పసుపు వర్ణద్రవ్యాన్ని(బిలిరుబిన్) ఫిల్టర్ చేస్తుంది. అయితే, ఫెయిల్ అయ్యే ముందు ఈ పని చేయదు. అందుకే ఈ లక్షణం కనిపిస్తుంది. దీన్ని పచ్చకామెర్లు అని పిలుస్తారు.


ముదురు రంగు మూత్రం


లివర్ ఫెయిల్ అయ్యే ముందు మూత్రం రంగు మారుతుంది. లివర్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నప్పుడు కాలేయం సరిగ్గా పనిచేయదు. దీంతో బిలిరుబిన్ పేరుకుపోతుంది. సాధారణంగా బిలిరుబిన్‌ని కాలేయం ఫిల్టర్ చేస్తుంది. అయితే, ఈ సమయంలో లివర్ పనిచేయకపోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది. మూత్రపిండాల ద్వారా అధిక బిలిరుబిన్ విసర్జించబడటం వల్ల మీ మూత్రం అసాధారణంగా ముదురు రంగులో మారవచ్చు.


పొత్తి కడుపు వాపు, నొప్పి


కాలేయం ద్రవం సమతుల్యత, ప్రోటీన్ స్థాయిలను నియంత్రించలేకపోవడం వల్ల పొత్తికడుపులో ద్రవం పేరుకుపోతుంది. దీంతో పొత్తి కడుపు వాపు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో భరించలేనంత నొప్పి ఉంటుంది. ఈ లక్షణం తరచుగా కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.


చర్మంపై దురద


కాలేయం ఫెయిల్ అయ్యే ముందు చర్మంపై దురద కనిపిస్తుంది. దద్దుర్లు లేకుండా నిరంతర దురద ఉంటుంది. కాలేయ పనితీరు సరిగా లేకపోవడం వల్ల చర్మం కింద పిత్త లవణాలు పేరుకుపోవడంతో చర్మంపై దురద వస్తుందని నిపుణులు అంటున్నారు. ఎటువంటి కారణం లేకుండా చర్మంపై దురద పెడితే నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.


ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయి


* ఆకలి లేకపోవడం


* పొత్తి కడుపులో అసౌకర్యం


* వికారం, వాంతులు


* కాళ్లు, చీలమండల్లో వాపు


* సులభంగా గాయాలు అవ్వడం


* మతిమరుపు


* లేత లేదా బంకమట్టి రంగు మలం


ఎప్పుడు వైద్యుణ్ని సంప్రదించాలి?


ఈ లక్షణాలు తీవ్రమైనప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి చేయి దాటే ముందు కొన్ని లక్షణాలు తీవ్రంగా ఉంటాయి.


* చర్మం లేదా కళ్ళు అకస్మాత్తుగా పసుపు రంగులోకి మారడం


* కుడి పొత్తి కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి


* తీవ్రమైన అలసట


* ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు


* రక్తం వాంతులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa