ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంట్ స్విచ్‌లు కూడా 24 క్యారెట్ల బంగారమే,,,ఇంద్రభవనం లాంటి ఇల్లు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 07:43 PM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక కుటుంబానికి చెందిన ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బంగారు థీమ్‌తో కూడిన ఆ ఇంద్రభవనం లాంటి ఇల్లుకు సంబంధించిన వీడియోను ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ పోస్ట్ చేయడంతో అది తెగ చక్కర్లు కొడుతోంది. ఆ విశాలమైన భవనంలో ఏకంగా 10 బెడ్రూంలు ఉన్నాయి. వాటిలో ఫర్నిచర్ దగ్గరి నుంచి విద్యుత్ స్విచ్‌ల వరకు మొత్తాన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయడం గమనార్హం. అయితే ఆ భవనం యజమాని కుటుంబం.. తరతరాల నుంచి ధనవంతులేమీ కారు. ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆ వ్యక్తి.. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా ఎదిగి.. ఈ స్థాయికి చేరుకున్నారు. ఇక ఆ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతని కృషిని ప్రశంసించడంతోపాటు భద్రతాపరమైన ఆందోళనలను కూడా వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రియం సరస్వత్ .. ఇటీవల ఆ స్వర్ణ భవనాన్ని సందర్శించి.. ఒక వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఆ కుటుంబం అనుమతితో ప్రియం సరస్వత్.. ఆ భవనాన్ని మొత్తం తిరిగి చూపించారు. ఆ భవనం ముందు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో ఒక అరుదైన 1936 మోడల్ వింటేజ్ మెర్సిడెస్ కారు కూడా ఉండటం గమనార్హం.


ఇక ఆ భవనం లోపల అడుగుపెట్టగానే ఎక్కడ చూసినా బంగారంతో మెరిసిపోతోంది. మరీముఖ్యంగా.. ప్రతి చిన్న వస్తువును బంగారంతో తయారు చేయడం చూసేవారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక లైట్లు, ఫ్యాన్లు వేసే స్విచ్‌లను కూడా 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయడం చూసి ప్రియం సరస్వత్ కూడా ఆశ్చర్యపోయాడు. ఇక ఆ భవనంలో 10 పడకగదులు ఉన్నాయని.. అంతేకాకుండా ఆవరణలో ఒక గోశాల కూడా ఉందని ఆ కుటుంబం వెల్లడించింది.


అయితే ఆ భవనం యజమాని తన అద్భుతమైన ప్రయాణాన్ని వివరించాడు. సామాన్యుడి నుంచి సంపన్నుడిగా మారిన కథను కూడా పంచుకున్నాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి.. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా రోడ్లు, వంతెనలు, భవనాలను నిర్మిస్తూ ఎలా విజయవంతమైన వ్యాపారిగా ఎదిగారో వివరించారు. తమది మొత్తం 25 మంది సభ్యుల కుటుంబం అని.. తమ కుటుంబం మొత్తం ఒకే ఒక పెట్రోల్ పంప్‌పై ఆధారపడి ఉండేదని తెలిపారు. ఇలా అయితే కుటుంబం జీవించడం చాలా కష్టమని గ్రహించానని.. అందుకే ప్రభుత్వ కాంట్రాక్టులు చేయడంలోకి ప్రవేశించినట్లు స్పష్టం చేశాడు. ప్రభుత్వం కోసం రోడ్లు, వంతెనలు, భవనాలు, టోల్‌గేట్లు నిర్మిస్తానని పేర్కొన్నాడు. ఇప్పుడు 300 గదుల పెద్ద హోటల్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పాడు. ఇదే తన ఎదుగుదల ప్రయాణమని ఆ ఇంటి ఓనర్ వెల్లడించాడు.


ఇక ఈ వీడియోను "ఇండోర్‌లో బంగారంతో అలంకరించబడిన ఇల్లు" అనే టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది. దీంతో అనేక మంది నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆ భవనం సినిమా సెట్టింగ్‌ను పోలి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు బంగారు పూత పూసిన ఎలక్ట్రికల్ స్విచ్‌లపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతటి సంపన్న నివాసానికి భద్రత గురించి మరికొందరు నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందులో చాలా మంది నెటిజన్లు.. ఈ ఇంటి ఓనర్‌లు చాలా డబ్బు ఉన్నా.. సాధారణ జీవితాన్ని సాగించడం పట్ల ప్రశంసలు గుప్పించారు. వారు చాలా సాధారణంగా, వినయంగా ఉన్నారని.. విలువలు, నైతికత లేని వారి వద్ద లక్ష్మీదేవి ఉండదని అనడంలో సందేహం లేదని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. "ఇది ఇల్లు కాదు, మహల్. చాలా అందంగా, సొగసైనది, వావ్ అనిపిస్తోంది" అని మరొకరు వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa