వరకట్న వేధింపుల కారణంగా 27 ఏళ్ల నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కట్నం కింద 80 తులాల బంగారం, రూ.70 లక్షల విలువైన కారు ఇచ్చినా.. భర్త, అత్తామామలకు ఆశ తీరలేదు. దీంతో ఆ నవవధువును శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారు. అవన్నీ తట్టుకోలేని ఆ యువతి.. పెళ్లైన 2 నెలలకే బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు.. ఆ యువతి తన తండ్రికి వాయిస్ మెసేజ్ పంపించింది. అందులో తన గోడు మొత్తం వెళ్లబోసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే అసలు పెళ్లిళ్లు అన్నీ ఇలా ఎందుకు అవుతున్నాయో అర్థం కావడం లేదు.
దేశంలో వరకట్న నిరోధక చట్టం అమల్లోకి వచ్చి 60 ఏళ్లు పూర్తయినా ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర సంచలనంగా మారుతోంది. తమిళనాడులోని తిరుప్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలనే ఓ నవవధువు.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడం తీవ్రంగా కలిచి వేస్తోంది. తిరుప్పూర్‌కు చెందిన 27 ఏళ్ల రాధన్య అనే యువతిని.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో.. 28 ఏళ్ల కవిన్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. బట్టల కంపెనీ యజమాని అయిన అన్నాదురై.. పెళ్లి సమయంలో తన కుమార్తెకు కట్న కానుకల కింద 80 తులాల బంగారు నగలు.. రూ.70 లక్షలు విలువ చేసే వోల్వో కారును వరుడు కవిన్ కుమార్‌కు అప్పగించారు.
తల్లిదండ్రులు ఈశ్వరమూర్తి, చిత్రాదేవి రాధన్యను వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే జూన్ 29 (ఆదివారం) మొండిపాల్యంలోని గుడికి వెళ్తున్నానని చెప్పిన రాధన్య.. ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మార్గ మధ్యలో తన కారు ఆపి పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. అయితే.. ఎక్కువసేపు కారు ఒకే చోట పార్క్ చేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కారులో రాధన్య మృతదేహాన్ని గుర్తించారు.
అయితే.. ఆత్మహత్య చేసుకునే ముందు రాధన్య తన తండ్రికి 7 వాయిస్ మెసేజ్‌లు పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ మెసేజ్‌లలో భర్త, అత్తమామల టార్చర్ తట్టుకోలేకపోతున్నానని.. అందుకే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు చెప్పింది. తాను చనిపోతున్నందుకు క్షమించాలని తండ్రిని వేడుకుంది. "వాళ్ల టార్చర్ భరించలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఎవరికైనా చెప్పుకున్నా.. జీవితంలో ఇలాంటి కష్టాలు సర్వసాధారణం, భరించాలి అంటున్నారు కానీ.. నా సమస్యను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు" అని ఆవేదనతో రాధన్య వాయిస్ మెసేజ్‌లు పంపించింది.
"నా చుట్టూ ఉన్నవాళ్ళు నటిస్తున్నారు. నేను అబద్ధం ఆడుతున్నట్లు అనుకుంటున్నారు. నేనెందుకు ఇంత సైలెంట్ అయిపోయానో ఎవరూ అర్థం చేసుకోవడం లేదు" అని తెలిపింది. "నా జీవితంలో టార్చర్ భరించలేకపోతున్నాను. అత్తమామలు మానసికంగా వేధిస్తుంటే.. భర్త శారీరకంగా హింసిస్తున్నాడు. ఈ జీవితం నాకు ఇష్టం లేదు. నేను బతకలేను" అని వాయిస్ మెసేజ్ పెట్టింది. "నాన్న.. నువ్వు, అమ్మే నాకు ప్రపంచం. నా చివరి శ్వాస వరకు మీ మీదే ఆశ. కానీ మిమ్మల్ని బాధపెట్టాను" అంటూ చనిపోయే ముందు రాధన్య మెసేజ్ పెట్టింది.
రాధన్య మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంచి కుటుంబం అని నమ్మించి తన కుమార్తెను మోసం చేశారని.. ఆమె తండ్రి అన్నాదురై తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు. తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా తీవ్ర హింసకు గురిచేశారని ఆరోపించారు. పెళ్లైన 15 రోజులకే రాధన్య ఇంటికి తిరిగి వచ్చిందని.. అప్పుడు రాజీ పడమని తాను చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు. ఆమె అత్త కూడా వచ్చి ఇక నుంచి అలా జరగదని హామీ ఇచ్చినా.. తిరిగి వెళ్లిన 20 రోజుల్లోనే మరింత మానసిక, శారీరక హింసకు గురి చేసినట్లు తెలిపారు. సుమారు 4.5 కిలోల బంగారం (500 సవర్లు) గురించి ప్రశ్నించారని.. ఇతర కుటుంబాలు వ్యాపారాలు ప్రారంభించడానికి వరుడికి రూ.100 కోట్లు ఇచ్చాయని పోల్చి చూపించి చిత్ర హింసలకు గురి చేశారని అన్నాదురై పోలీసులకు వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రాధన్య భర్త కవిన్ కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవిలను అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa