మైనర్లలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. అత్యాచారం, హత్య వంటి దారుణాలకు తెగిస్తున్నారు. మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే.. ఆంక్షలు విధిస్తున్నారని చెప్పి కన్న వారిని సైతం కడదేరుస్తున్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో పదో తరగతి చదివే యువతి తన ప్రేమకు అడ్డు వస్తుందని.. ప్రియుడితో కలిసి కన్నతల్లినే హత్య చేయించింది. ఈక్రమంలో మరో సంచలన సంఘటన వెలుగు చూసింది. 13 సంవత్సరాల బాలిక.. ఫేక్ కిడ్నాప్ డ్రామా ఆడింది. పైగా తనను విడిచిపెట్టాలంటే 15 లక్షల రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్స్ డిమాండ్ చేసినట్లుగా ఓ లేఖ రాసింది. కుమార్తె కిడ్నాప్ అయ్యిందని భావించిన తల్లిదండ్రులు.. పోలీసులను ఆశ్రయిచండంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్ డ్రామా ఆడటానికి బాలిక చెప్పిన కారణాలు విన్న వారి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ వివరాలు..
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలిక ఫేక్ కిడ్నాప్ డ్రామా ఆడింది. 15 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని నోట్ రాసింది. తల్లి తనను ఊరికూరికే తిడుతుందని.. మొబైల్ ఫోన్ చూడనివ్వడం లేదని.. లిప్‌స్టిక్ కూడా వేసుకోనివ్వడం లేదని.. అందుకే తాను ఇలా ఫేక్ కిడ్నాప్ డ్రామా ఆడానని బాలిక పోలీసులకు తెలిపింది. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జబల్‌పూర్,ఖమారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో ఈ సంఘటన వెలుగు చూసంది.
బాలిక తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి గుమ్మంలో ఆమెకు ఒక లెటర్ కనిపించింది. దానిలో మీ కుమార్తె మా వద్ద ఉంది. ఆమె మీ వద్దకు క్షేమంగా చేరాలంటే.. 15 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు దీని గురించి పోలీసులకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక రాసి ఉంది. ఇది చదివి భయపడ్డ తల్లిదండ్రులు.. వెంటనే ఖమారియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దీని గురించి ఫిర్యాదు చేశారు.
మైనర్ బాలిక కిడ్నాప్ వ్యవహారం కావడంతో.. పోలీసులు ఆలస్యం చేయకుండా దర్యాప్తు ప్రారంభించారు. జబల్‌పూర్ నుంచి భోపాల్ వరకు ఉన్న పోలీసులను అలర్ట్ చేసి.. గాలింపు చర్యలు ప్రారంభించారు. బాలిక ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఈక్రమంలో ఓ ఆటో డ్రైవర్ పోలీసులు తెలిపిన పోలికలతో ఉన్న 13 ఏళ్ల బాలికను సదర్ ప్రాంతంలో డ్రాప్ చేశానని తెలిపాడు.
అతడిచ్చిన సమాచారంతో సదర్ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. 5 గంటల పాటు గాలించిన తర్వాత బాలిక ఆచూకీ గుర్తించారు. ఆ తర్వాత తనను కిడ్నాప్ చేసింది ఎవరని ప్రశ్నించగా.. బాలిక షాకింగ్ సమాధానం చెప్పింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తల్లి తిట్ల నుంచే తప్పించుకోవడం కోసం తాను ఈ నాటకం ఆడినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాక తన పాకెట్ మనీతో ఓ రూమ్ రెంట్‌కి తీసుకుని.. నెల రోజుల పాటు.. తాను ఒక్కతే ప్రశాంతంగా గడపాలని భావించి.. ఈ ఫేక్ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిపింది. బాలికకు, ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి.. తిరిగి పంపించారు.
ఈసందర్భంగా పోలీసులు మాట్లాడతూ.. కిడ్నాప్ గురించి తెలియగానే మేం వెంటనే స్పందించాము.అయితే బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన నోట్‌ను.. ఆమె నోట్ బుక్స్‌ని పరిశీలిస్తే రెండు సేమ్ అని తేలింది. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఆమెను గుర్తించగలిగాము. బాలిక కిడ్నాప్ గురించి తెలిసి ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అని చెప్పుకొచ్చారు. అంతేకాక తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా, ఓర్పుతో ప్రవర్తించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa