ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం మంగళవారం జాతీయ క్రీడా విధానం (NSP) 2025కు ఆమోదం తెలిపింది. ఇది దేశ క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పడుతుందని కేంద్రం పేర్కొంది. క్రీడల వైపు యువతను ప్రోత్సహించడం, క్రీడల్లో దేశ ప్రదర్శనను మెరుగుపరచడం, క్రీడాకారుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఇందులో నిర్ణయాలు తీసుకున్నారు.
భారత్‌ను ప్రపంచ క్రీడా శక్తి కేంద్రంగా, 2036 ఒలింపిక్ క్రీడలతో సహా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో బలమైన పోటీదారుగా మార్చేందుకు ఈ పాలసీ రోడ్‌మ్యాప్‌లా పనిచేయనుంది. జాతీయ క్రీడా విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయా స్పందించారు. ఇది దేశంలోని క్రీడారంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు, అథ్లెట్‌లకు మద్దతు ఇచ్చేందుకు, ప్రపంచ క్రీడలలో భారత్‌ను బలీయమైన శక్తిగా మార్చేందుకు సహాయం చేస్తుందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులను గుర్తించడం కూడా ఇందులో భాగమే. అట్టడుగుస్థాయి నుంచే ప్రతిభను గుర్తించి, అలాంటి ఆటగాళ్లను సానబెట్టాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. శిక్షణ, కోచింగ్ సహా అథ్లెట్‌లకు మద్దతు ఇచ్చేందుకు ప్రపంచస్థాయి వ్యవస్థలను నిర్మించడమే దీని లక్ష్యం. ఇదే సమయంలో జాతీయ క్రీడా సమాఖ్యల సామర్థ్యం, పాలనను మెరుగుపరచాలి.
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. క్రీడలను జాతీయ ఉద్యమంగా మార్చడానికి, దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. సమాజంలో అవేర్‌నెస్ కల్పించాలి. పాఠశాలలు స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించడం వంటివి ఇందులో ఉన్నాయి. జాతీయ క్రీడా విధానం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గనిర్దేశనం చేస్తుంది. అయితే ఇదే సమయంలో జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా వారి సొంత విధానాలను సవరించడానికి, రూపొందించడానికి ప్రోత్సాహం అందిస్తుంది.
ఇక ఇదే సమయంలో ఇతర అంశాలకు సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి పచ్చజెండా ఊపింది. దీని ద్వారా తయారీ రంగంలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనుంది. తమిళనాడులోని పరమకుడి-రామనాథపురం హైవే నాలుగు లేన్‌ల విస్తరణకు ఆమోదం తెలిపింది. కేబినెట్ ప్రాజెక్టు కింద 46.7 కి.మీల పొడవైన రహదారి నిర్మాణానికి రూ.1853 కోట్లు ఖర్చు చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa