మరాఠా రాజకీయాల్లో శనివారం ఆసక్తికరమైన, అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం విడిపోయిన అన్నదమ్ములు.. ఇప్పుడు ఒక్కటయ్యారు. వారే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే. ముంబయి వేదికగా శనివారం వాయిస్ ఆఫ్ మరాఠీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నదమ్ములు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి హాజరయ్యారు. మహారాష్ట్రలో హిందీని మూడో భాషగా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. అయితే విమర్శలు రావటంతో త్రిభాషా విధానం అమలు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని తాజాగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇది ప్రతిపక్షాల విజయమంటూ ముంబయిలో శనివారం వాయిస్ ఆఫ్ మరాఠీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఒకే వేదికపై కనిపించడం మాత్రమే కాదు.. విభేదాలను పక్కనపెట్టి ఆప్యాయంగా కనిపించారు. దీంతో రెండు పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. మరోవైపు 2005లో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే విడిపోయారు. అయితే సుమారు 20 ఏళ్ల తర్వాత కలుసుకోవటం మరాఠా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇక ఈ కార్యక్రమంలో రాజ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమను కలిపేందుకు బాల్ ఠాక్రే ఎంతో ప్రయత్నించినా సాధ్యం కాలేదని.. దేవేంద్ర ఫడ్నవీస్ కలిపారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ చేశారంటూ రాజ్ ఠాక్రే సెటైర్లు వేశారు. మహారాష్ట్రకు వ్యతిరేకంగా ఫడ్నవీస్ నిర్ణయం తీసుకోవడం ద్వారా తమను తిరిగి కలిపారని.. ఆ రకంగా అనుకోకుండానే తమని ఒకే వేదిక పైకి చేర్చారన్నారు. మహారాష్ట్ర ఐక్యత విషయంలో ఇకపై తాము ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటామని రాజ్ ఠాక్రే ప్రకటించారు. ఈ క్రమంలోనే కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు.
తమకు హిందీపై ఎలాంటి వ్యతిరేకత లేదన్న రాజ్ ఠాక్రే.. బలవంతంగా రుద్దాలని చూస్తే ఒప్పుకోమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధానాన్ని మహారాష్ట్రపై రుద్దుతామంటే ఏం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం ఇకనైనా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మరోవైపు ఇద్దరం కలిసే ఇక్కడకు వచ్చామని.. ఇకపై కలిసే ఉంటామని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మరోవైపు ఇరవై ఏళ్ల పాటు వేర్వేరుగా ఉన్న అన్నదమ్ములు కలిసి పోవటంతో.. ఇప్పుడు మరాఠా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఇకపై కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa