ముంబైలో జరిగిన భయంకరమైన 26/11 ఉగ్రదాడుల కుట్రలో కీలక సూత్రధారి అయిన తాహవూర్ రాణా.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో సంచలన విషయాలను వెల్లడించినట్లు సమాచారం. పాకిస్థాన్ సైన్యానికి తాను విశ్వసనీయ ఏజెంట్‌గా పని చేశానని, 26/11 దాడులు జరిగిన సమయంలో తాను ముంబైలోనే ఉన్నట్లు రాణా అంగీకరించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం 26/11 దాడుల పాకిస్థాన్ సంబంధాలపై మరింత లోతైన దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది.
తహవూర్ రాణా పాకిస్థాన్ సైన్యంలో వైద్య విభాగానికి చెందిన మాజీ అధికారి. 2008 ముంబై దాడుల కుట్రలో డేవిడ్ హెడ్లీతో కలిసి కీలక పాత్ర పోషించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దాడులకు ముందు హెడ్లీ భారత దేశంలో రెక్కీ నిర్వహించడానికి, లష్కరే తొయిబాకు సంబంధించిన కార్యకలాపాలను సులభతరం చేయడానికి రాణా సహాయం చేసినట్లు భారత దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. సంవత్సరాల తరబడి కొనసాగిన న్యాయ పోరాటం తర్వాత అమెరికా నుంచి రాణాను భారత్‌కు రప్పించడంలో ఎన్‌ఐఏ ఇటీవలే విజయం సాధించింది.
ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న రాణా రోజుకు సుమారు 10 గంటల పాటు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో అతను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో తనకున్న సంబంధాలపై కీలకమైన వివరాలను వెల్లడించాడని వర్గాలు వెల్లడించాయి. అబు ఖహఫా, అబు అల్కమా, సాజిద్ మజీద్ వంటి సహ-కుట్రదారులకు సంబంధించిన స్కెచ్‌లు, ముఖ్యమైన నిఘా సమాచారాన్ని కూడా ఎన్‌ఐఏ సేకరించినట్లు సమాచారం.
ముంబై దాడులకు కుట్ర పన్నిన ప్రధాన వ్యక్తులలో రాణా ఒకరని, ఆ దాడుల్లో 166 మంది మరణించారని, 238 మందికి పైగా గాయపడ్డారని ఎన్‌ఐఏ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. రాణా భారత్‌లో స్లీపర్ సెల్‌లతో సంబంధాలను కలిగి ఉన్నాడా, పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో అతనికి ఉన్న సంబంధాలు ఏమిటి అనే అంశాలపై కూడా దర్యాప్తు సంస్థ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాణా విచారణతో 26/11 దాడుల వెనుక ఉన్న పూర్తి కుట్ర, పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల ప్రమేయం వంటి వివరాలు వెలుగులోకి వస్తాయని భారత్ ఆశిస్తోంది. ఇది దాడుల బాధితులకు న్యాయం అందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa