పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి.. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన చేప జాతులను సంరక్షించడానికి చైనా ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. యాంగ్జీ నదికి ప్రధాన ఉపనది అయిన రెడ్ రివర్ (చిషుయ్ హే) బేసిన్‌లో ఉన్న 300 ఆనకట్టలను కూలగొట్టింది. అంతేకాకుండా 373 హైడ్రో పవర్ స్టేషన్నలో ఉన్న 342 చిన్న స్థాయి జల విద్యుత్ కేంద్రాలను మూసివేసింది. జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి, నదుల సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి చైనా చేపట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ ప్రపంచ పర్యావరణవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ మహత్తరమైన చొరవ 2020లో ప్రారంభం అయింది. రెడ్ రివర్, చైనాలోని యునాన్, గుయిజౌ, సిచువాన్ ప్రావిన్సుల గుండా ప్రవహిస్తుంది. చైనా ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థకు ఈ నది అతి కీలకమైనది. అందుకే గత కొన్ని దశాబ్దాల కాలంగా దీనిపై భారీ స్థాయిలో డ్యాములు, హైడ్రోపవర్ ప్రాజెక్టులను నిర్మించింది. అవి జలచరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యంగా యంగ్జీ ఉపనదుల్లో ఒకటై చిఘయ్ హే (రెడ్ రివర్)ను అరుదైన, స్థానిక చేప జాతులకు ఆవాసంగా ఉంటుంది. అలాంటిది డ్యాములు, జల విద్యుత్ కేంద్రాలు నిర్మించడంతో.. ఆ నదీ ప్రవాహాన్ని కట్టడి చేశాడు. గతంలో ఈ నది ప్రవించిన ప్రాంతాలకు నీరు కూడా అందకపోవడంతో.. ఆ ప్రాంతాలన్నీ ఎండిపోయాయి. ఫలితంగా చేప జాతులు కూడా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.
ఈ విషయం గుర్తించిన చైనా సర్కారు.. కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన స్థానిక చేప జాతులైన యాంగ్జీ స్టర్జన్‌ను రక్షించడం కోసం నిర్మించిన డ్యాములు, జల విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేయాలనుకుంది. 2020లో ఈ నిర్ణయం తీసుకోగా అప్పటి నుంచి డ్యాములను కూల్చి వేస్తూ వస్తోంది. అలాగే జల విద్యుత్ కేంద్రాలను కూడా ఆపేసింది. 2024 డిసెంబర్ చివరి నాటికి.. 357 ఆనకట్టలలో 300 ఆనకట్టలను విజయవంతంగా తొలగించింది. అలాగే 373 చిన్న జలవిద్యుత్ కేంద్రాలలో 342 కేంద్రాల కార్యకలాపాలను పూర్తిగా నిలిపి వేసింది. ఇది పర్యావరణ పరిరక్షణ పట్ల చైనాకున్న నిబద్ధతను, ఈ ప్రాజెక్ట్ యొక్క విస్తృత స్థాయిని తెలియజేస్తోంది.
ఈ చర్యల ఫలితంగా ఇప్పటికే సానుకూల ప్రభావాలు కనిపించడం ప్రారంభించాయి. నదులలో నీటి ప్రవాహం మెరుగు పడింది. చేపల వలస మార్గాలు అన్‌బ్లాక్ అయ్యాయి. అలాగే వాటి సంతానోత్పత్తి పెరిగింది. అలాగే ఈ చేపల ప్రాంతాలు కూడా పునరుద్ధరించబడ్డాయి. యాంగ్జీ స్టర్జన్‌తో పాటు ఇతర చేప జాతులు తిరిగి రావడం, మొత్తం చేప జాతుల సంఖ్య పెరగడం వంటి సానుకూల ఫలితాలను ఇప్పటికే పరిశీలకులు గుర్తించారు. ఇది పర్యావరణ పునరుద్ధరణ ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతం అవుతున్నాయో తెలియజేస్తోంది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం... ఆర్థికాభివృద్ధి కోసం పర్యావరణాన్ని త్యాగం చేయకూడదని, జీవవైవిధ్యాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమని ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని పంపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa