ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదేళ్ల తర్వాత చైనాకు భారత విదేశాంగ మంత్రి.. ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 09:06 PM

ఐదేళ్ల అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి చైనా పర్యటనకు వెళ్లారు. చైనాలో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల కౌన్సిల్ సమావేశానికి భారత్ నుంచి కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని జైశంకర్ ప్రస్తావించారు. పహల్గామ్ దాడి ‘ఉద్ధేశపూర్వకంగా జరిపింది’ అని అభివర్ణించిన ఆయన... ఉగ్రవాదంపై ఎస్‌సిఓ రాజీ లేని వైఖరిని తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముష్కరుల దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. జమ్మ కశ్మీర్‌లో పర్యటక రంగాన్ని దెబ్బతీయడమే కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టడమే ఈ దాడి లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘పహల్గామ్ ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఈ అమానుష చర్య వెనుక ఉన్న కుట్రదారులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది’’అని జయశంకర్ అన్నారు.


ఉగ్రవాదం, విభజన వాదం, అతివాదం ఈ మూడు దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు షాంఘై సహకార సంస్థ ఏర్పాటైందని గుర్తుచేసిన జైశంకర్.. ఇవి తరచూ కలిసి పనిచేసే శక్తులుగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఎస్‌సీఓ ఏర్పాటు మూల లక్ష్యాలు నిబద్ధంగా ఉండాలంటే, ఉగ్రవాదంపై రాజీలేని విధానాన్ని అనుసరించాలి’’ అని ఆయన పునరుద్ఘాటించారు.


పలు సంఘర్షణలు, ఆర్థిక అస్థిరత, తీవ్ర పోటీ, భయానక విధానాలతో ప్రపంచం సాగుతోన్న ఈ తరుణంలో ఎస్‌సిఓ సభ్య దేశాల మధ్యం భరోసా, సహకారం అత్యవసరమని జయశంకర్ హితవు పలికారు. ‘‘ఈ అస్థిర పరిస్థితుల్లో ప్రపంచ గమనాన్ని సుస్థిరం చేసే బాధ్యత మన ముందుంది. దీని ద్వారా మాత్రమే మనం సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించగలం’’ అని జైశంకర్ పేర్కొన్నారు. ‘‘ప్రపంచ వ్యవహారాలను ప్రభావితం చేయాలంటే, సభ్య దేశాలన్నీ ఒకే దారిలో నడవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగాలి’’ అని ఆయన స్పష్టం చేశారు.


2020 జూన్‌ గల్వాన్ లోయ సైనిక ఘర్షణల తర్వాత భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ మొదటిసారి చైనాలో పర్యటించడం గమనార్హం. ఇటీవల రక్షణ మంత్రుల సదస్సుకు రాజ్‌నాథ్ సింగ్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు. క్వింగ్‌డాంగ్‌లో జరిగిన సమావేశం తర్వాత సంయుక్త ప్రకటనలో పహల్గామ్ ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడం, పాక్‌లోని బలూచిస్థాన్‌ను అందులో చేర్చడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని భారత్‌పై పరోక్షంగా ఆరోపణలు చేయడంగా భావించి.. ఈ ప్రకటనపై సంతకం చేయడానికి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటన రద్దుకావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa