ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెళ్లికి 10 రోజుల వేతనంతో కూడిన సెలవులు

international |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 08:02 PM

ఇప్పటి వరకు ప్రభుత్వాలు మెటర్నిటీ, పెటర్నిటీ వంటి సెలవులు మాత్రమే ఇచ్చేది. ఆరోగ్యం బాగాలేకపోయినా ఇతర ఏవైనా సమస్యలు ఉన్నా జీతం కట్ చేసుకుని మరీ సెలవులు ఇచ్చేది. అది కూడా అవసరం అయితే మాత్రమే. కానీ తొలి సారిగా.. పెళ్లిళ్లు చేసుకునే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఎవరు పెళ్లి చేసుకున్నా.. వారికి 10 రోజులు వేతనంతో కూడిన సెవవులు ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే ఇది మన దగ్గర కాదులెండి. దుబాయ్‍లో.


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించారు. వివాహం చేసుకునే సర్కారు ఉద్యోగులకు 10 రోజుల వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమానికి, కుటుంబ స్థిరత్వానికి, వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యతకు దుబాయ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది.


డిక్రీ నంబర్ (31) ఆఫ్ 2025 కింద జారీ చేయబడిన ఈ కొత్త విధానం 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దుబాయ్ ప్రభుత్వ విభాగాలు, న్యాయాధికార సంస్థలు, సైనిక సిబ్బంది (క్యాడెట్‌లు మినహా), ప్రత్యేక అభివృద్ధి మండలాలు, ఫ్రీ జోన్‌లలో పని చేస్తున్న ఎమిరాటీ పౌరులందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగులు తమ వివాహ వేడుకలను, కొత్త జీవిత ప్రారంభాన్ని ఎటువంటి ఆర్థిక లేదా పని ఒత్తిడి లేకుండా ఆస్వాదించడానికి వీలు కలుగుతుంది.


సెలవుకు అర్హత, నిబంధనలు..


ఈ 10 రోజుల పెళ్లి సెలవును పొందడానికి కొన్ని నిర్దిష్ట షరతులు ఉన్నాయి. ఉద్యోగి యొక్క జీవిత భాగస్వామి (భర్త లేదా భార్య) కూడా యూఏఈ పౌరుడై ఉండాలి. ఉద్యోగి తన ప్రొబేషనరీ పీరియడ్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. అలాగే వివాహ ఒప్పందం యూఏఈలోని సంబంధిత అధికార సంస్థచే ధృవీకరించబడి ఉండాలి. వివాహ ఒప్పందం 2024 డిసెంబర్ 31 తర్వాత కుదిరి ఉండాలి. అలాగే సెలవు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వివాహ ధృవీకరణ పత్రాన్ని ఒకసారి సమర్పిస్తే సరిపోతుంది.


ఈ సెలవును వివాహ ఒప్పందం జరిగిన తేదీ నుండి ఒక సంవత్సరం లోపు ఎప్పుడైనా.. నిరంతరాయంగా లేదా విడివిడిగా తీసుకోవచ్చు. ఉద్యోగులు తమకు అర్హత ఉన్న ఇతర సెలవులతో ఈ పెళ్లి సెలవును కలిపి కూడా ఉపయోగించుకోవచ్చు. సెలవు కాలంలో.. ఉద్యోగికి పూర్తి స్థూల జీతం, అన్ని అలవెన్సులు, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా ఎటువంటి భారం లేకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సహాయ పడుతుంది.


ప్రత్యేక నిబంధనలు..


సాధారణంగా పెళ్లి సెలవులో ఉన్న ఉద్యోగులను తిరిగి విధులకు పిలవడానికి ప్రభుత్వ సంస్థలకు అనుమతి లేదు. అయితే సైనిక సిబ్బంది విషయంలో.. పని అవసరమైతే తిరిగి పిలవడానికి మినహాయింపు ఉంది. అటువంటి సందర్భాలలో మిగిలిన సెలవు దినాలను తిరిగి విధుల్లో చేరిన తర్వాత వాడుకోవడానికి అనుమతిస్తారు. అలాగే తీవ్రమైన కారణాలు ఉంటే.. నేరుగా పర్యవేక్షకుడి ఆమోదంతో ఉపయోగించని పెళ్లి సెలవును తదుపరి సంవత్సరానికి కూడా బదిలీ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa