పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌కు బిడ్డ చనిపోతే ఆ బాధేంటో ఆ రోజు అర్ధమవుతుందని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తండ్రి రాజేశ్ నర్వాల్ అన్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులకు పాల్పడి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. వీరిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) ఒకరు. ఏప్రిల్ 16న వివాహం జరగడంతో హనీమూన్ కోసం మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన బైసరన్ లోయకు భార్య హమాన్షీతో కలిసి వెళ్లారు. కాళ్లపారాని ఆరకముందే ఉగ్రవాదులు కాల్పుల్లో భర్తను కోల్పోయిన హిమాన్షి నర్వాల్.. అతడి మృతదేహం పక్కన కూర్చుని విలపిస్తోన్న ఫోటో యావత్తు దేశాన్ని కన్నీళ్లుపెట్టించింది. లెఫ్టినెంట్ నర్వాల్ కుటుంబాన్ని తీరని వేదన మిగిల్చింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ క్రమంలో ‘‘తన కొడుకు లేదా కూతురికి ఎవరైనా హాని చేస్తే’ మాత్రమే తన బాధను మునీర్ అర్థం చేసుకోగలడని రాజేశ్ అన్నారు.
‘‘తన కొడుకు లేదా కూతురికి ఎవరైనా హాని చేసిన రోజు మాత్రమే అతడు (పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్) నా బాధను అర్థం చేసుకోగలడు. వాళ్లు ఉగ్రవాద దాడిలో చనిపోయారని తెలిసిన రోజున మాత్రమే అతడికి తెలిసొస్తుంది.. నేను, ఒక సామాన్య వ్యక్తిగా పక్కనబెట్టండి.. ఓ తండ్రిగా నా హృదయం బద్దలైంది.. అతడి కొడుకు లేదా కూతుర్ని చంపినట్లయితే అప్పుడు ఆ బాధను తెలుసుకుంటాడు..’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నా కుటుంబం ముందు నేను ఏడవలేను.. నా భార్య, నా తల్లిదండ్రులు, వారంతా బాధలో ఉన్నారు. కానీ నేను సంయమనం పాటించాలి, అప్పుడే నేను బలంగా ఉన్నానని వారు భావిస్తారు. మానసిక ప్రశాంతత లేదు.. నిద్రలేని రోజులు గడుపుతున్నాం.. మేము సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తే మందులు ఇస్తారు.. కానీ, మా మనోవేదనకు చికిత్స లేదు.’’ అని కన్నీటిపర్యంతమయ్యారు.
‘‘వినయ్ చిన్నతనం నుంచే సైనికుడు కావాలనేది జీవితాశయంగా పెట్టుకున్నాడు... కాన్వాయ్ చూస్తే ఆనందంతో నన్ను రోడ్డుపైకి తీసుకెళ్లేవాడు.. వాడిలో ఉన్న నాయకత్వం, నిబద్ధత, ధైర్యం అద్వితీయమైనవి. మేమంతా కలిసి 30 ఏళ్ల పాటు తయారుచేసుకున్న వ్యక్తి. నిజాయితీగా బతకమని నేర్పించాం. నిజాయితీగా జీవించాడు. ధైర్యంగా చనిపోయాడు. నా జీవితంలో ఎప్పటికీ నా హీరో వినయ్‌నే’’ అని దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆవేదనకు గురయ్యారు.
పహల్గామ్ దాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించిన నేపథ్యంలో రాజేశ్ నర్వాల్ స్పందించారు. ‘‘ఇది సరైన చర్య. కానీ, నామమాత్రపు ఆంక్షలతో ఉగ్రవాదం అంతం కాదు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే సిద్ధాంతంగా పెట్టుకున్న సంస్థలు, టీఆర్ఎఫ్ వెనుక ఉన్న లష్కరే తొయిబా, ఆర్థిక వనరులు, మద్దతుదారులు వీరందర్నీ గుర్తించి దోషులను శాశ్వతంగా నిర్మూలించాలి. నిషేధాలు మాత్రమే సరిపోవు’’ అని రాజేశ్ నర్వాల్ ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa