అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ.. వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ట్రంప్‌కు 'క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ' ( Chronic Venous Insufficiency - CVI) అనే అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. తాజాగానే ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు శ్వేతసౌధం గురువారం ప్రకటించింది. ఆయన చేతులపై కనిపించిన గాయాలు, కాళ్ల వాపుపై అనేక సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. ట్రంప్ ఇటీవల తన కాళ్ల కింది భాగంలో స్వల్ప వాపును గమనించారని, దీనిపై వైట్ హౌస్ మెడికల్ యూనిట్ సమగ్ర పరీక్షలు నిర్వహించిందని తెలిపారు. ఈ పరీక్షల్లో ట్రంప్‌నకు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ ఉన్నట్లు తేలిందని.. ఇది వృద్ధులలో సాధారణంగా కనిపించే ఒక నిరపాయకరమైన పరిస్థితి అని ఆమె వివరించారు. సిరల్లోని చిన్న కవాటాలు రక్తాన్ని గుండె వైపు పంపడంలో సరిగా పని చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని... ఫలితంగా రక్తం కాళ్లలో పేరుకుపోయి వాపు వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ చేతుల వెనుక భాగంలో కనిపించిన గాయాలపై కూడా లీవిట్ స్పందించారు. అవి తరచుగా కరచాలనాలు చేయడం, ఆస్పిరిన్ వాడకం వల్ల కలిగే స్వల్ప కణజాలల వల్ల ఏర్పడ్డాయమని పేర్కొన్నారు. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ట్రంప్ ఆస్పిరిన్ తీసుకుంటారని తెలిపారు. ఈ పరీక్షల్లో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) లేదా ధమనుల వ్యాధి వంటి తీవ్రమైన సమస్యలకు ఎలాంటి ఆధారాలు లభించలేవని, ట్రంప్ ఆరోగ్యం పరీక్షలన్నీ "సాధారణ పరిమితుల్లో" ఉన్నాయని ఆయన వైద్యుడు కెప్టెన్ సీన్ బార్బబెల్లా ధ్రువీకరించారు. ట్రంప్ గుండె నిర్మాణం, పనితీరు సాధారణంగా ఉన్నాయని ఎకోకార్డియోగ్రామ్ కూడా నిర్ధారించిందని బార్బబెల్లా తన లేఖలో పేర్కొన్నారు.
79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యంపై గతంలో కూడా పలుమార్లు ఊహాగానాలు చెలరేగాయి. ఈ తాజా ప్రకటన ఆ సందేహాలు అన్నింటినీ తీర్చడానికే చేశారు. ప్రస్తుతం ట్రంప్ "అద్భుతమైన ఆరోగ్యంతో" ఉన్నారని, ఆయనకు ఎలాంటి అసౌకర్యం లేదని లీవిట్ స్పష్టం చేశారు. క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీకి.. సంపీడన చెప్పులు ధరించడం, కాళ్లను ఎత్తులో ఉంచడం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వంటి చికిత్సలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం, ముఖ్యంగా నడవడం, సిరల ద్వారా రక్తాన్ని పంప్ చేయడానికి సహాయ పడుతుందని కూడా వారు సిఫార్సు చేశారు. అవసరమైనప్పుడు మందులు, వైద్య చికిత్సలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ వివరణతో అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ప్రజల్లో ఉన్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa