ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ.. ప్రపంచ దేశాలపై దాడులు చేయిస్తున్న పాకిస్థాన్ మరో దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదులకు, విమాన హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి మరణ శిక్షను రద్దు చేసింది. ఇందుకోసం ఏకంగా చట్టంలోనే సవరణలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పాక్ సెనెట్ తాజాగా ఆమోదం తెలపడం గమనార్హం కాగా.. ప్రపంచం మొత్తం పాక్ చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు. ఇది ఒక్క పాకిస్థాన్‌కు మాత్రమే సాధ్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
పాకిస్థాన్ సెనేట్ ఇటీవల ఒక కీలకమైన చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. 'క్రిమినల్ లాస్ (సవరణ) బిల్లు 2025' పేరుతో ప్రవేశ పెట్టిన ఈ బిల్లు.. దేశంలో అమలులో ఉన్న కొన్ని నేరాలకు మరణ శిక్షను రద్దు చేయాలని చెబుతోంది. ముఖ్యంగా మహిళలను బహిరంగంగా వివస్త్రలను చేయడం, అవమానకరంగా ప్రదర్శించడం, అలాగే హైజాకర్లకు ఆశ్రయం కల్పించడం వంటి నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష స్థానంలో జీవిత ఖైదును విధించాలని నిర్ణయించింది. ఈ చట్ట మార్పుకు ప్రధాన కారణం యూరోపియన్ యూనియన్ (EU)తో పాకిస్థాన్‌కు ఉన్న GSP+ (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్లస్) వాణిజ్య ఒప్పందం.
ఈ ఒప్పందం ప్రకారం.. అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను పాటించాలి. అలాగే మరణశిక్షను 'అత్యంత తీవ్రమైన నేరాలకు' మాత్రమే పరిమితం చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా దేశీయ చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్లే ప్రస్తుతం మరణశిక్ష విధించబడుతున్న రెండు నేరాలకు బదులుగా జీవిత ఖైదు, అలాగే భారీ జరిమానాలు విధించేలా సవరణలు చేశారు. ఇది యూరోపియన్ దేశాలతో పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలను పెంపొందించడానికి, అంతర్జాతీయ వేదికపై దేశం విశ్వసనీయతను పెంచడానికి తోడ్పడుతుంది.
సెనేట్‌లో ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. కొంతమంది సెనేటర్లు.. ముఖ్యంగా మహిళలను వివస్త్రలను చేసే నేరాన్ని 'హత్యతో సమానమైన తీవ్రమైన నేరంగా' అభివర్ణించారు. అలాంటి వాటికి మరణశిక్షను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరణశిక్షను తొలగించడం వల్ల నేరగాళ్లలో భయం తగ్గుతుందని, నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశ న్యాయ శాఖ మంత్రి ఈ అభ్యంతరాలను తోసిపుచ్చారు. శిక్షల తీవ్రత ద్వారా మాత్రమే నేరాలు తగ్గుతాయన్న వాదనను ఆయన అంగీకరించలేదు.
యూరప్‌ను ఉదాహరణగా చూపుతూ.. అక్కడ మరణశిక్ష లేనప్పటికీ నేరాల రేటు తక్కువగా ఉందని ఆయన గుర్తు చేశారు. శిక్షలు కఠినంగా ఉండటం ముఖ్యం కాదని, నేరాలను సమర్థవంతంగా నిరోధించడానికి న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉండటమే ప్రధానమని ఆయన వాదించారు. ఈ క్రిమినల్ చట్టాల సవరణ బిల్లుతో పాటు సెనెట్ పలు ఇతర కీలక బిల్లులైన 'ఎక్స్‌ట్రాడిషన్ సవరణ బిల్లు', 'పాకిస్థాన్ పౌరసత్వ చట్టం సవరణ బిల్లు'లకు కూడా ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణలు పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో గణనీయమైన మార్పులకు నాంది పలికాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa