ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణం..13వ తేదీ భూమిపూజ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 07:45 PM

ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఆగస్ట్ 13వ తేదీ భూమి పూజ నిర్వహించనున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆగస్ట్ 13న బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి భూమిపూజ జరగనుంది. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. భూమిపూజ నేపథ్యంలో ఏర్పాట్లను బాలకృష్ణ, ఆయన సన్నిహితులు శనివారం పరిశీలించారు. మరోవైపు మొత్తం 21 ఎకరాల్లో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రి నిర్మాణ ప్లాన్‌లను సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌కు బాలకృష్ణ వివరించారు. మొత్తం మూడు దశల్లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు.


మరోవైపు అమరావతి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని తొలి దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత దీనిని వేయి పడకలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. 2014-19 మధ్య కాలంలోనే అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అప్పట్లోనే ప్రభుత్వం ఇందుకు భూమి కేటాయించింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి.. అధికారంలోకి రావటంతో ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించడంతో నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోనూ ఒక ఆస్పత్రి ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. అలాటి ఇబ్బందులు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించారు. ఈ ఆస్పత్రిలో పేదలకు తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య ఖర్చులు చెల్లించలేని పక్షంలో అలాంటి వారికి ఉచితంగా వైద్యం, ఆర్థిక సహాయం కూడా అందిస్తారు. ఇలాంటి ఆస్పత్రి ఏపీ ప్రజలకు కూడా ఒకటి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa