ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పితే శరీరంలో కనిపించే లక్షణాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 11:27 PM

రక్తంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పితే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అయితే, రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పించే కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పితే శరీరంలో కనిపించే 8 లక్షణాలు, నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలతో పాటు నరాలు డ్యామేజ్


గత కొన్నేళ్లుగా డయాబెటిస్ ముప్పు పెరుగుతూనే ఉంది. డయాబెటిస్ కేసులు దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే దానిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దీనిని సరైన చికిత్స లేదు. కేవలం మందులు, జీవనశైలి మార్పులతోనే షుగర్‌ని నియంత్రించవచ్చు. ఇక, రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పితే.. కీలకమైన అవయవాలు దెబ్బతింటాయి.


రక్తంలో పెరిగిన షుగర్ లెవల్స్‌ని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పితే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల్ని సకాలంలో గుర్తించకపోతే.. తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పినప్పుడు శరీరంలో కనిపించే ఎనిమిది లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


డీహైడ్రేషన్


​రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు.. శరీరం మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్‌ను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఇది శరీరంలో నీటి కొరతకు కారణమవుతుంది. దీంతో, దాహం ఎక్కువగా వేస్తుంది. ఈ పరిస్థితిని పాలీడిప్సియా అంటారు. ఈ పరిస్థితుల్లో మీరు సాధారణం కంటే ఎక్కువ నీరు తాగుతారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో కూడా ఎక్కువగా దాహం వేస్తుంది. నిరంతర దాహం వేయడం అనేది అన్‌కంట్రోల్ డయాబెటిస్‌కి సంకేతం కావచ్చు. ఈ లక్షణాన్ని లైట్ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.


తరచుగా మూత్రవిసర్జన


రక్తంలో చక్కెర స్థాయిలు 180 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు చక్కెరను విసర్జిస్తాయి. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా యూరిన్ ఎక్కువగా వస్తుంది. దీనిని పాలీయూరియా అంటారు. రాత్రి వేళ కూడా ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీని కారణంగా అలసట, నిద్ర భంగం కలుసుంది. ఈ లక్షణం నిర్జలీకరణ, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది. అందుకే ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.


ఆకలి ఎక్కువ వేయడం


ఇన్సులిన్ లేకపోవడం లేదా ఇన్సులిన్ నిరోధకత కారణంగా శరీర కణాలు గ్లూకోజ్‌ను తీసుకోలేవు. దీని కారణంగా మన మెదడు ఎక్కువ తినమని సంకేతాలు ఇస్తుంది. ఇది తరచుగా ఆకలికి దారితీస్తుంది. దీనిని పాలీఫాగియా అంటారు. ఎక్కువ తిన్న తర్వాత కూడా మీరు సంతృప్తి చెందరు. ఈ లక్షణం కొనసాగితే, రక్తంలో చక్కెర పెరగడంతో పాటు మీరు బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.


బరువు తగ్గడం


శరీరం గ్లూకోజ్ నుంచి శక్తిని పొందనప్పుడు.. అది పేరుకుపోయిన కొవ్వును బర్న్ చేస్తుంది. ఆ కొవ్వును శక్తిగా మార్చడం ప్రారంభిస్తుంది. మీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకపోయినప్పటికీ బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ లక్షణం టైప్ 1 డయాబెటిస్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అనియంత్రిత టైప్ 2 డయాబెటిస్‌లో కూడా సంభవించవచ్చు. ఇది తీవ్రమైన హెచ్చరిక సంకేతం.


అలసట, బలహీనత


గ్లూకోజ్ శరీరానికి కావాల్సిన శక్తిని అందించే వనరు. ఇది కణాల్లోకి ప్రవేశించలేనప్పుడు, శరీరం తీవ్రమైన శక్తి కొరతను ఎదుర్కొంటుంది. ఫలితంగా మీరు తింటూ తగినంత విశ్రాంతి తీసుకున్నా.. నిరంతరం అలసటతో బాధపడుతుంటారు. దీని కారణంగా బలహీనత కూడా ఏర్పడుతుంది. ఈ అలసట పని, ఆలోచనా సామర్థ్యం, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.


అస్పష్టమైన దృష్టి


రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు.. అది కంటి లెన్స్ నుంచి ద్రవాన్ని తీసుకుంటుంది. లెన్స్ ఆకారాన్ని మారుస్తుంది. దీని ఫలితంగా అస్పష్టమైన లేదా మసక మసకగా కనబడటం ప్రారంభమవుతుంది. ఎక్కువ కాలం పాటు రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే.. అది కంటి నరాలను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిని డయాబెటిక్ రెటినోపతి అంటారు. అందుకే ఈ లక్షణాన్ని గుర్తించి సకాలంలో చికిత్స పొందగలరు.


గాయం నెమ్మదిగా మానడం


రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలికంగా ఎక్కువగా ఉండటం వల్ల శరీరం ప్రసరణ వ్యవస్థ, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. ఇది గాయం నెమ్మదిగా మానడానికి దారితీస్తుంది. ముఖ్యంగా పాదాలు, చర్మం, చిగుళ్ళు, మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. చిన్న గాయాలు చాలా వారాల పాటు నయం కాకపోవచ్చు. ఇది తీవ్రమైన పరిస్థితికి సంకేతం కావచ్చు. ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యుణ్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.


చేతులు, కాళ్ళలో తిమ్మిరి


చాలా కాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల శరీర నరాలు దెబ్బతింటాయి. దీంతో, డయాబెటిక్ న్యూరోపతి సంభవిస్తుంది. ఇది మొదట వేళ్లు లేదా కాలి వేళ్లలో జలదరింపు, మంట లేదా తిమ్మిరితో ప్రారంభమవుతుంది. క్రమంగా, ఇది నొప్పి లేదా స్పర్శ కోల్పోవడం వరకు పెరుగుతుంది. చివరకి కదలడం కష్టతరం చేస్తుంది. అంతేకాకుండా గాయాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa