ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యలపై టీటీడీ ఘాటు రిప్లై

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 07:48 PM

తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్వీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలపై టీటీడీ స్పందించింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం అమలు చేయాలనే అంశాన్ని ఎల్వీ సుబ్రమణ్యం తప్పుబట్టడాన్ని టీటీడీ ఛైర్మన్ ఖండించారు. క్యూ కాంప్లెక్స్‌లలో తిరుమల శ్రీవారి భక్తుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏఐ సాయంతో నిర్దేశించిన సమయంలోపు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఆలోచన చేసినట్లు టీటీడీ తెలిపింది, ఇందుకోసం గూగుల్, టీసీఎస్‌లతో పాటుగా ఇతర ఐటీ సంస్థల సహకారం తీసుకోవాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వివరించింది.


శ్రీవారి భక్తులకు నిర్దేశించిన సమయానికి దర్శనం కల్పించేందుకు, దర్శనం సమయాన్ని భక్తులకు ముందస్తుగా తెలియజేసేందుకు మాత్రమే ఏఐ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ తెలిపింది. దర్శన సమయాన్ని భక్తులకు ముందుగానే తెలియజేయటం ద్వారా భక్తులు కంపార్టుమెంట్లలో ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా చేయాలని.. అలాగే ఆ సమయంలో ఇతర ఆలయాలను దర్శించుకునే విధంగా చూడాలని ఆలోచన చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అయితే మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకరమని అన్నారు.


సీనియర్ అధికారిగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యం తిరుమలలో ఏఐ టెక్నాలజీ ఉపయోగం లేదంటూ మాట్లాడటం సమంజసం కాదని.. ఇలాంటి వ్యాఖ్యల వలన శ్రీవారి భక్తులలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని టీటీడీ ఛైర్మన్ అన్నారు. శ్రీవారి దాతల సాయంతో టీటీడీ ఉచితంగా చేస్తున్న పనిని కూడా కూడా వృథా అనడంపై ఎల్వీ సుబ్రమణ్యం విజ్ఞతకే వదిలేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. భక్తులకు దర్శనం సమయాన్ని మందస్తుగా తెలియజేసేందుకు మాత్రమే ఏఐ వాడాలని టీటీడీ నిర్ణయించిందని.. కానీ ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకమని ఎల్వీ సుబ్రమణ్యం చెప్పటం సబబు కాదన్నారు.


ఆదివారం ఉదయం ఎల్వీ సుబ్రమణ్యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గంట లేదా 3 గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవమని అన్నారు. ఏఐ టెక్నాలజీ వాడినా శీఘ్రదర్శనం కష్టమేననని.. ప్రస్తుతం వాడుతున్న విధానానికి మించింది లేదని అభిప్రాయపడ్డారు. ఏఐ వినియోగం కోసం టీటీడీ ధనాన్ని వృథా చేయడం సరైంది కాదని.. ఆచరణకు సాధ్యం కాని ఆలోచనలకు స్వస్తి పలకాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేపగా.. టీటీడీ స్పందించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa