ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ బెదిరింపులకు కౌంటర్.. భారత్‌కు మద్దతుగా నిలిచిన రష్యా

international |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 07:53 PM

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులపై మాస్కో స్పందించింది. భారత్‌పై అన్యాయమైన వాణిజ్య ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘ఇటువంటివి నైతికంగా బెదిరింపులు.. రష్యాతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడం చట్టబద్ధమైనవిగా భావించం’’ అని క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ మీడియాతో అన్నారు. ‘‘తాము ఎవరితో వ్యాపార సంబంధాలు పెట్టుకోవాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి సార్వభౌమ దేశానికి ఉంటుంది. ఆయా దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వారికి ఉంది’’ అని అని స్పష్టం చేశారు.


ఉక్రెయిన్‌‌తో శాంతి ఒప్పందానికి రష్యా ముందుకు రాకుంటే మాస్కో, దాని వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కూడా కొత్త ఆంక్షలు విధిస్తామని ట్రంప్ గతవారం హెచ్చరించారు. కానీ, ఈ బెదిరింపులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ పూచికపుల్ల మాదిరిగా తీసిపారేస్తున్నారు. ఇదే సమయంలో భారత్ సైతం ట్రంప్ వ్యాఖ్యలను ‘అన్యాయమైనవి’గా పేర్కొంటూ.. దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపే ప్రసక్తేలేదని భారత్ కుండబద్దలు కొట్టింది.


‘ప్రతి ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలాగానే.. భారత్ కూడా తన దేశ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను రక్షించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది’ అని కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా, ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాక.. రష్యా నుంచి చమురు దిగుమతులను అమెరికా ప్రోత్సహించిందని ఢిల్లీ వర్గాలు గుర్తుచేశాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తోకతెగిన పాములా రెచ్చిపోతున్నారు. భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తానంటూ సోమవారం (ఆగస్టు 4న) ప్రకటించారు. ఈ క్రమంలోనే రష్యా స్పందించింది.


భారత చమురు కంపెనీలపై విమర్శలు చేస్తున్న ఐరోపా సమాఖ్య వైఖరిని కూడా న్యూఢిల్లీ ఖండించింది. రష్యాతో వ్యాపారం చేస్తూ.. భారత్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేయడం దారుణమని పేర్కొంది. ప్రపంచ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా భారత దిగుమతులు ఉంటాయని వ్యాఖ్యానించింది.


మరోవైపు, పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకున్న ట్రంప్.. దాయాదిపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నారు. పలు దేశాలపై ప్రతీకార సుంకాలు భారీగా పెంచినా.. పాక్‌కు మాత్రం తగ్గించారు. గత దశాబ్దకాలంలో ఎన్నడూలేని విధంగా పాక్‌తో అమెరికా అంటకాగుతుండటం యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అయితే, దీని వెనుక భారత్‌పై ఒత్తిడి పెంచే వ్యూహం ఉందనేది మాత్రం స్పష్టమవుతోంది. అంతేకాదు, స్వీయ ప్రయోజనాల కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుందనడానికి పాకిస్థాన్‌తో చెట్టపట్టాలేసుకోవడమే ఉదాహరణ.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa