అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీహార్‌లో నివాసం ఉండాలనుకుంటున్నారా? ఆయనే స్వయంగా నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారా? బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో వెలుగు చూసిన ఓ వింత ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని అపహాస్యం చేసేందుకు కొందరు ఆకతాయిలు ఏకంగా ట్రంప్ పేరుతోనే నకిలీ దరఖాస్తు చేసి అధికారులకు షాక్ ఇచ్చారు. సమస్తిపూర్ జిల్లాలోని మొహియుద్దీన్‌నగర్ పరిధిలో జూలై 29న ఓ ఆన్‌లైన్ దరఖాస్తు అందింది. BRCCO/2025/17989735 నంబర్‌తో ఉన్న ఆ దరఖాస్తులో డొనాల్డ్ ట్రంప్ ఫొటో ఉంది. చిరునామాగా హసన్‌పూర్ గ్రామం, వార్డ్ నెం. 13, బకర్‌పూర్ పోస్ట్, మొహియుద్దీన్‌నగర్ పోలీస్ స్టేషన్ అని పేర్కొన్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన అధికారులకు ఫొటో, ఆధార్ నంబర్, బార్‌కోడ్, చిరునామా వంటి వివరాలన్నీ తప్పుగా ఉన్నట్లు తేలింది.ఇది ఎవరో కావాలనే చేసిన పనిగా గుర్తించిన సర్కిల్ ఆఫీసర్ వెంటనే ఆ దరఖాస్తును తిరస్కరించారు. ప్రభుత్వ వ్యవస్థ పరువు తీసేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద ఫిర్యాదు చేసినట్లు మొహియుద్దీన్‌నగర్ సీవో ధృవీకరించారు. "ఈ పనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దరఖాస్తు చేసిన ఐపీ అడ్రస్, లాగిన్ వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు" అని ఆయన వివరించారు.బీహార్‌లో ఇలాంటి నకిలీ దరఖాస్తుల ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత కొద్ది వారాలుగా పాట్నా, తూర్పు చంపారన్, నలంద జిల్లాల్లో 'కుక్క బాబు', 'నితీశ్ కుమారి', చివరకు 'సోనాలికా ట్రాక్టర్' పేరుతో కూడా నివాస ధృవపత్రాల కోసం దరఖాస్తులు రావడం గమనార్హం. వరుస ఘటనలతో రాష్ట్రంలో ఆన్‌లైన్ ధృవపత్రాల జారీ వ్యవస్థలోని లోపాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు డిజిటల్ పాలనపై ప్రజల్లో అపనమ్మకం కలిగించేలా ఉన్నాయని, సైబర్ భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa